శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగుండె సంకేతాలను విస్మరించొద్దు...

23 గంటల క్రితం

గుండె సంకేతాలను విస్మరించొద్దు! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 06:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్టుగా అనిపించినా, చాలాసార్లు దానికి ముందు లేదా ప్రారంభమైన సమయంలో శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను చూపిస్తుంది. ఛాతిలో బిగుతు, ఒత్తిడి లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణ అలసట, దవడ, మెడ, వీపు, భుజాలు లేదా చేతుల్లో నొప్పి, వికారం, చల్లని చెమటలు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. అందుకే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సహాయం పొందడం ముఖ్యం.

​గుండెపోటు అంటే తప్పనిసరిగా తీవ్రమైన ఛాతినొప్పి ఉండాలని భావించడం సరికాదు. కొందరిలో ఛాతిలో స్వల్పమైన ఒత్తిడి లేదా అసౌకర్యం మాత్రమే ఉండవచ్చు. మరికొందరిలో ఆయాసం, వికారం, అసాధారణ అలసట, వీపు లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ప్రధానంగా కనిపించవచ్చు. లక్షణాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక బరువు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఇప్పటికే సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు నియంత్రణలో ఉంచుకోవాలి. ​ఆహారంలో అధికంగా ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, అదనపు చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని పరిమితం చేయాలి. కూల్‌ డ్రింక్స్‌, స్వీట్స్‌, పఫ్‌లు, చిప్స్‌ వంటి స్నాక్స్‌కు బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, చేపలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి.

​పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల వరకు తగిన శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. వేగంగా నడక, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవచ్చు. ఇంతవరకు వ్యాయామం చేయని వారు ఒక్కసారిగా ఎక్కువ శ్రమ పెట్టకుండా తక్కువ స్థాయి నుంచి ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలి.

​ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యపానాన్ని పరిమితం చేయడం లేదా నివారించడం మంచిది. తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన శారీరక శ్రమ వంటి అలవాట్లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్