వంటగది ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ చెత్తబుట్ట నుంచి వచ్చే దుర్వాసన ఇబ్బంది పెడుతుంటుంది. చెత్తను ఖాళీ చేసిన తర్వాత కూడా బుట్ట నుంచి వాసన వస్తుంటుంది. చెత్తబుట్ట అడుగున పేరుకుపోయిన మురికి, ఆహారపు రేణువులు, కూరగాయల రసాలు, తడి వ్యర్థాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించడానికి ప్రతిసారీ కొత్త చెత్తబుట్ట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో దుర్వాసనను తగ్గించవచ్చు.
చేపలు, సముద్రపు ఆహారం, మిగిలిపోయిన వంటకాలు, పాడైపోయిన పండ్లు, కూరగాయల వ్యర్థాలు త్వరగా దుర్వాసనను వెదజల్లుతాయి. అందువల్ల ఇలాంటి వ్యర్థాలను ఎక్కువసేపు చెత్తబుట్టలో ఉంచకుండా ప్రత్యేక సంచిలో వేసి వెంటనే బయట పారేయాలి.
- చెత్తను వెంటనే బయట పారేయడం సాధ్యం కానప్పుడు చెత్తబుట్ట అడుగున కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, ఆ తర్వాత చెత్త సంచిని ఉంచాలి. బేకింగ్ సోడా దుర్వాసనను పీల్చుకోవడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయ రసం తీసిన తర్వాత తొక్కలను వెంటనే పారేయకుండా కొంతసేపు చెత్తబుట్ట దగ్గర ఉంచాలి. నిమ్మ తొక్కల నుంచి వచ్చే సహజమైన సువాసన దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వాటిని ఎక్కువసేపు చెత్తబుట్టలో ఉంచకూడదు. అవి పాడైపోతే తిరిగి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు చెత్త సంచిని మార్చినప్పటికీ బుట్ట నుంచి వాసన వస్తూనే ఉంటుంది. దీనికి కారణం అడుగున, గోడలకు అంటుకున్న ఆహారపు రేణువులు, మురికి నీరు, వ్యర్థాల అవశేషాలు కావచ్చు. అలాంటప్పుడు సబ్బు లేదా పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్‌తో చెత్తబుట్టను పూర్తిగా కడగాలి. తేమ లేకుండా ఆరబెట్టి కొత్త చెత్త సంచిని వేయాలి.
చెత్తబుట్ట పరిసరాల్లో ఒక దూది ఉండపై ఒకటి లేదా రెండు చుక్కల సుగంధ తైలం వేసి చెత్తబుట్ట దగ్గర సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. అయితే పిల్లలు, పెంపుడు జంతువులకు అందకుండా జాగ్రత్త పడాలి.








కామెంట్లు (0)