బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాత్రిపూట ఆస్తమా తీవ్రత ఎందుకు..?

1 రోజు క్రితం

రాత్రిపూట ఆస్తమా తీవ్రత ఎందుకు..? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చలికాలంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువవుతుంటాయి. ఆస్తమాతో బాధపడేవారికి ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, ఇంట్లో ఉండే అలర్జీ కారకాలు, శరీరంలో వచ్చే మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చల్లని గాలిని పీల్చడం వల్ల శ్వాసనాళాలు సంకోచానికి గురై శ్వాస కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము పురుగులు, బూజు, పెంపుడు జంతువుల నుంచి వచ్చే వెంట్రుకలు అలర్జీకి కారణమవుతాయి. ఇవి శ్వాసనాళాల్లో వాపును మరింత పెంచి ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. రాత్రివేళ పడుకున్నప్పుడు శ్వాసనాళాల్లో శ్లేష్మం (మ్యూకస్‌) పేరుకుపోవడం, ముక్కు వెనుక భాగం నుంచి గొంతులోకి స్రావాలు చేరడం వల్ల దగ్గు, ఛాతీలో బిగుతు, పిల్లికూతలు వంటి సమస్యలు వస్తాయి. వీటికి తోడు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సిగరెట్‌ పొగ, ఇంట్లోని వాయు కాలుష్య కారకాల వల్ల ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.

ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు..

- బయటకు వెళ్లేటప్పుడు చల్లని గాలి తగలకుండా చూసుకోవాలి. ముక్కు, నోటికి స్కార్ఫ్‌ కప్పుకోవాలి.

- ఇంటి పరిసరాలను శుభ్రంగా, పొడిగా, గాలి ప్రసరణ ఉండేలా ఉంచాలి.

- దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండు కవర్లను క్రమం తప్పకుండా ఉతకాలి.

- సిగరెట్‌ పొగ, అగరబత్తుల పొగ, ఘాటైన సువాసనలు, శ్వాసకోశానికి ఇబ్బంది కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి.

- స్థానికంగా గాలి నాణ్యతను గమనిస్తూ ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించాలి.

- ఆస్తమా ఉన్నవారు లక్షణాలు కనిపించకపోయినా వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.

- ఇన్‌హేలర్లను సరైన పద్ధతిలో ఉపయోగించడం నేర్చుకోవాలి.

​

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

రాత్రివేళల్లో తరచూ దగ్గు రావడం, పిల్లికూతలు వినిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో నిద్ర నుంచి మేల్కొనడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఆస్తమా నియంత్రణలో లేదనడానికి సంకేతాలు కావచ్చు. తీవ్రమైన శ్వాస ఇబ్బంది, మాట్లాడలేకపోవడం, పెదవులు నీలం రంగులోకి మారడం లేదా ఇన్‌హేలర్‌ ఉపయోగించినా ఉపశమనం కలగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సరైన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్