బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్పాహారం.. ఆరోగ్య జాగ్రత్తలు....

1 రోజు క్రితం

అల్పాహారం.. ఆరోగ్య జాగ్రత్తలు... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఉదయం అల్పాహారానికి పోహ, ఉప్మా, కార్న్‌ఫ్లేక్స్, బ్రెడ్ జామ్ తీసుకుంటున్నారా? అయితే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు, అలాగే రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండేవారు వీటిని తీసుకునే విషయంలో మోతాదు, పదార్థాల ఎంపికపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

- ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించలేక చాలామంది త్వరగా అయిపోయే పోహనో, ఉప్మానో చేసుకుని తినేస్తారు. తినడానికి రుచిగా, త్వరగా అయిపోతాయని వీటిని అల్పాహారంగా తీసుకుంటే వాటిలో ఉండే కార్బొహైడ్రేట్ల మోతాదు, కూరగాయలు, పీచు పదార్థాలు వంటి వాటి పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యూట్రీషనిస్టులు సూచిస్తున్నారు.

ఉప్మా : ఇది రవ్వతో తయారుచేసుకుంటాం. చాలామంది కూరగాయల్ని కలపకుండా తయారుచేసుకుని ఎక్కువ మొత్తంలో తింటారు. దీనివల్ల శరీరానికి కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది. ఇందులో పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఉప్మాని కూరగాయ ముక్కల (క్యారెట్, టమాటా)తో కలిపి తయారుచేసుకుని తింటే ఆహారంలో ఫైబర్ పెరుగుతుంది. షుగర్ ఉన్నవారు ఉప్మాను తగిన మోతాదులో తీసుకోవడం, కూరగాయలు వంటి పీచు పదార్థాలు ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవడం మంచిది.

పోహ : చాలామంది కూరగాయల ముక్కలు, పల్లీలు వేసుకుని పోహ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఇందులో కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దీన్ని ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవచ్చు. అయితే తరచూ తీసుకునేవారు మోతాదును, అందులో కలిపే పదార్థాలను గమనించడం మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు తమ మొత్తం ఆహారంలో కార్బొహైడ్రేట్ల మోతాదును పరిగణనలోకి తీసుకోవాలి.

బటర్ అండ్ జామ్ శాండ్విచ్ : బ్రెడ్‌పై బటర్ అండ్ జామ్ కలుపుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. రోజువారీ ఆహారంలో ఇదొక భాగం. అయితే దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్, కొవ్వు స్థాయిలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ అల్పాహారంలో ఫైబర్ తక్కువగా ఉండొచ్చు. దీంతో మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో సమతుల్యత కొరవడే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్నవారు జామ్ వంటి చక్కెర అధికంగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.

టీ-బిస్కెట్స్ : ఉదయాన్నే ఏవీ తీసుకోకుండా.. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక కప్పు టీలో బిస్కెట్లు వేసుకుని కొంతమంది తీసుకుంటారు. సాధారణంగా బిస్కెట్లలో రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండొచ్చు. ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండొచ్చు. దీనికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తగిన మోతాదులో తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవారు బిస్కెట్లు, చక్కెర కలిపిన టీ తీసుకునే మోతాదుపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.

పాలు-కార్న్‌ఫ్లేక్స్ : అల్పాహారంలో పాలు-కార్న్‌ఫ్లేక్స్ కలిపి తీసుకుంటే కొన్ని రకాల కార్న్‌ఫ్లేక్స్‌లో ఫైబర్ తక్కువగా ఉండొచ్చు. ఒకవేళ తీసుకున్నా పండ్ల ముక్కలు, నట్స్ వేసుకుని తింటే ఆహారంలో ఫైబర్, ఇతర పోషకాలు పెరుగుతాయి. అయితే షుగర్ ఉన్నవారు చక్కెర కలిపిన కార్న్‌ఫ్లేక్స్‌ను ఎంచుకోకుండా, పండ్లను కూడా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. రోజూ మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, నట్స్, విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే సమతుల్య ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్