గుడ్డు తక్కువ ఖర్చుతో లభించే నాణ్యమైన ప్రొటీన్ల ఆహారం. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6.3 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఉడికించినా, ఆమ్లెట్ వేసినా ప్రొటీన్ల పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే, వండే విధానం వాటిని శరీరం జీర్ణించుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
గుడ్డును వేడి చేసినప్పుడు ప్రొటీన్ల నిర్మాణం మారుతుంది. దీంతో జీర్ణక్రియలోని ఎంజైమ్‌లు వాటిని సులభంగా విచ్ఛిన్నం చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, పచ్చి గుడ్డులోని ప్రొటీన్ల జీర్ణశక్తి 51.3 శాతం కాగా, వండిన గుడ్డులో అది 90.9 శాతంగా నమోదైంది. ఉడికించిన గుడ్డు, పోచ్డ్ ఎగ్, తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్.. వీటిలో ప్రొటీన్ల పరిమాణం దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే, నూనె, వెన్న, చీజ్ వంటి పదార్థాలు కలిపితే మొత్తం కొవ్వు, కేలరీలు పెరుగుతాయి. అందువల్ల గుడ్డును ఉడికించి తినడం లేదా ఆమ్లెట్ తయారీలో నూనెను పరిమితంగా వాడటం మంచి ఎంపిక.
పచ్చి గుడ్డుతో ప్రమాదం
పచ్చి గుడ్డులోని ప్రొటీన్లను శరీరం వండిన గుడ్డులోని ప్రొటీన్లంత సమర్థంగా జీర్ణించుకోలేదు. అంతేకాకుండా, పచ్చి లేదా సరిగా ఉడకని గుడ్లలో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చు. వీటి వల్ల ఆహార విషబాధ కలిగే ప్రమాదం ఉంది. గుడ్డును పూర్తిగా ఉడికించి తినడం ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.








కామెంట్‌లు (0)