రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని మనకు తెలుసు. మూలకణాలు (స్టెమ్ సెల్స్) దెబ్బతిన్న అవయవాలను పునర్నిర్మించగలవని కూడా తెలుసు. కానీ ప్రతి నెలా మహిళల శరీరం నుంచి సహజంగా బయటకు వచ్చే నెలసరి రక్తం ఒకరోజు మోకాళ్ల నొప్పులకు, కీళ్ల వ్యాధులకు మందుగా మారుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా? తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాలు అదే ఆశను కలిగిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మందికిపైగా ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ మోకాళ్లు, నడుము, భుజాలు, వేళ్ల కీళ్లలో ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కీళ్ల నొప్పులు, నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, చివరకు శస్త్రచికిత్స వరకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ప్రధానంగా నొప్పిని తగ్గించడానికే పరిమితమవుతున్నాయి. కార్టిలేజ్‌ను తిరిగి నిర్మించడం మాత్రం చాలా కష్టమైన పని. ఈ నేపథ్యంలో నెలసరి రక్తం నుంచి వచ్చిన కొత్త ఆశ శాస్త్ర ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.
అద్భుత కణాలు
ఆస్టియో ఆర్థరైటిస్ భారంలో మహిళల వాటా దాదాపు 60 శాతం. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఈ వ్యాధి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు భవిష్యత్తులో ఉపయోగపడే చికిత్స కూడా మహిళల నెలసరి రక్తంలోనే దాగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. నెలసరి రక్తంలో మెసెంకైమల్ స్ట్రోమల్ స్టెమ్‌సెల్స్ అనే ప్రత్యేక మూలకణాలు ఉంటాయి. ప్రతి నెలా గర్భాశయం లోపలి పొరను తిరిగి నిర్మించే పనిలో ఇవి పాల్గొంటాయి. అందుకే ఇవి చాలా చురుకైన కణాలుగా గుర్తింపు పొందాయి. ఎముకలు, మృదులాస్థి, రక్తనాళాలు, ఇతర కణజాలాల నిర్మాణంలో కూడా ఇవి సహకరించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
లిథువేనియాలోని ఇన్నోవేటివ్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త ఇలోనా ఉజిలియెనే నేతృత్వంలోని బృందం ముగ్గురు ఆరోగ్యవంతులైన మహిళల నుంచి నెలసరి రక్త నమూనాలను సేకరించింది. వాటిలోని స్టెమ్‌సెల్స్‌ను వేరు చేసి అధ్యయనం చేసింది. ఈ కణాలు విడుదల చేసే సూక్ష్మ బుడగల వంటి నిర్మాణాలను గుర్తించారు. వీటినే ఎక్స్‌ట్రాసెల్యులర్ వెసికల్స్ అంటారు. వీటిలో ప్రోటీన్లు, కొవ్వులు, మైక్రో ఆర్‌ఎన్‌ఏలు వంటి జీవరసాయన పదార్థాలు ఉంటాయి. కణాల మధ్య సమాచార మార్పిడిలో, కణజాలాల మరమ్మతులో కీలకపాత్ర పోషిస్తాయి.
మోకాళ్లకు మేలు
మన మోకాళ్లలో, ఇతర కీళ్లలో ఉండే కార్టిలేజ్ ఒక సహజ రక్షణ పొరలా పనిచేస్తుంది. ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా కాపాడుతుంది. ఈ కార్టిలేజ్‌లో ప్రధానంగా ఉండే కణాలను కాండ్రోసైట్స్ అంటారు. ఇవే కార్టిలేజ్‌ను నిర్మిస్తాయి. కానీ ఆస్టియో ఆర్థరైటిస్‌లో ఈ కణాలు బలహీనపడతాయి. కార్టిలేజ్ క్రమంగా అరిగిపోతుంది. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పెంచిన కాండ్రోసైట్స్‌కు నెలసరి రక్తం నుంచి సేకరించిన వెసికల్స్‌ను అందించారు. అప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఆ కణాలు వెసికల్స్‌ను గ్రహించి, కొత్త కార్టిలేజ్ పదార్థాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. కార్టిలేజ్‌కు బలం ఇచ్చే ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్, ప్రోటియోగ్లైకాన్స్ వంటి నిర్మాణాలు కూడా ఎక్కువగా తయారయ్యాయి. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల నుంచి తొలగించిన దెబ్బతిన్న కార్టిలేజ్ నమూనాలపై కూడా పరిశోధన చేశారు. దెబ్బతిన్న కణజాలంలో కూడా మంచి ప్రభావం కనిపించడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
రేపటి చికిత్స
ఈ పరిశోధనలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇది ‘సెల్-ఫ్రీ థెరపీ’ అనే కొత్త చికిత్సా విధానానికి మార్గం వేస్తోంది. అంటే స్టెమ్‌సెల్స్‌ను నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టకుండా, అవి విడుదల చేసే ఉపయోగకరమైన వెసికల్స్‌ను మాత్రమే చికిత్స కోసం ఉపయోగించడం. దీనివల్ల చికిత్స మోతాదును నియంత్రించడం సులభమవుతుంది. కణ మార్పిడి వల్ల వచ్చే తిరస్కరణ సమస్యలు కూడా తగ్గుతాయి. నెలసరి రక్తానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎముక మజ్జ వంటి మూలాల నుంచి స్టెమ్‌సెల్స్‌ను సేకరించాలంటే శస్త్రచికిత్స అవసరం. కానీ నెలసరి రక్తాన్ని నొప్పి లేకుండా, శరీరానికి ఎలాంటి హాని లేకుండా సేకరించవచ్చు. పిండకణాల పరిశోధనలో ఎదురయ్యే నైతిక వివాదాలు కూడా ఇందులో ఉండవు. అయితే ఇది ఇంకా ప్రారంభ దశ పరిశోధనే. వెసికల్స్‌లోని ఏ పదార్థం కార్టిలేజ్ పునర్నిర్మాణాన్ని ప్రేరేపిస్తోందో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మనుషులపై పెద్ద స్థాయి వైద్య పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. అయినప్పటికీ ఈ ఫలితాలు శాస్త్రవేత్తల్లో కొత్త ఆశను నింపుతున్నాయి.








కామెంట్‌లు (0)