- ఎటిసి కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన లోపం
-15 లక్షల మంది ప్రయాణికుల అవస్థలు
వాషింగ్టన్ : అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశ విమానయాన రంగాన్ని కుదిపేసింది. నాలుగు గంటలకుపైగా కొనసాగిన ఈ అంతరాయంతో వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పని చేయని కమ్యూనికేషన్ నెట్‌వర్క్...
శుక్రవారం ఎటిసి వ్యవస్థలో సమస్య తలెత్తింది. విమానాశ్రయాలు, విమానాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో అధికారులు విమానాల బయలుదేరే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో నాలుగు గంటలకు పైగా రాకపోకలను ఆపేశారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ ఈ ఆదేశాలను అమలు చేశాయి. కొన్ని విమానాలు రన్‌వేపైనే నిలిచిపోగా, మరికొన్నింటిలోని ప్రయాణికులను కిందకు దింపేశారు. ఏం జరుగుతుందో తెలియక విమానాశ్రయాల్లో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం లెక్కల ప్రకారం, అంతరాయం మొదలైన తర్వాత శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.30) అమెరికా విమానాశ్రయాల నుంచి సుమారు 11 వేల విమానాలు బయలుదేరాల్సి ఉంది. వాటిలో 15 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
అమెరికా విమానయాన వ్యవస్థలో దశాబ్దాల నాటి పరికరాలే ఇంకా వాడుకలో ఉన్నాయని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లోని పాత రౌటర్లు, స్విచ్‌లపై అధిక డేటా భారం పడటంతో సమాచారంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. విమానాల కదలికలను పర్యవేక్షించే కేంద్రాలకు సరైన సమాచారం అందక, భద్రత దృష్ట్యా బయలుదేరడాన్ని ఆపాల్సి వచ్చిందన్నారు. అలాగే, పాతబడిన ఆ వ్యవస్థలకు ఎఫ్‌ఎఎ చేస్తున్న అప్‌డేట్‌లే నిలిపివేతకు కారణమని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ పేర్కొన్నారు. ఇది అమెరికాకు ఉన్న ఏదైనా ముప్పు వల్ల జరగలేదని, ఈ వారం మైక్రోసాఫ్ట్‌లో జరిగిన అంతరాయంతో దీనికి సంబంధం లేదని ఆయన తెలిపారు. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నేలపైనే నిద్రపోయారు. శుక్రవారం 15వేలకు పైగా అమెరికా విమానాలు రద్దయ్యాయి. శనివారం సుమారు 3వేల విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశం ఉందని అంచనా. వ్యవస్థను నవీకరించకపోతే మరింత అంతరాయం తప్పదని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ హెచ్చరించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా సమగ్రంగా వ్యవస్థను మార్చాలన్నారు. ఇందుకోసం 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడాన్ని నిలిపివేయడం 2023 జనవరి తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో పైలట్లకు భద్రతా సమాచారం అందించే ఎఫ్‌ఎఎ వ్యవస్థలో లోపం తలెత్తి, సుమారు రెండు గంటలపాటు విమానాలు ఆగిపోయాయి. ఆ ఘటనలో 10 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.








కామెంట్‌లు (0)