మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్థిక సంస్కరణల బాటలో క్యూబా ..

20 జూన్, 2026

Cuban Economic Reforms
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హవానా : అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఏర్పడిన తీవ్రమైన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియోజ్ కానెల్ ప్రకటించారు. గురువారం కమ్యూనిస్ట్ పార్టీ (పిసిసి) నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అంగీకరిస్తూ, దేశ వాస్తవ పరిస్థితులు తక్షణ, అవసరమైన మార్పులను కోరుతున్నాయని పేర్కొన్నారు. సంక్షోభాన్ని కేవలం వివరించడం మాత్రమే పార్టీ పాత్ర కాదని, మార్చవలసిన వాటిని ఖచ్చితంగా మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత చర్యలను అత్యవసర ఆర్థిక, సామాజిక అజెండాగా ఆయన అభివర్ణించారు. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పర్యాటక రంగంలోకి కొత్త భాగస్వాముల ప్రవేశం, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యవసాయం, విదేశీ వాణిజ్య రంగాల్లో మార్పులు చేపట్టనున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, పురపాలక సంఘాలకు అధిక స్వయం ప్రతిపత్తి కల్పించేలా నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించనున్నారు. ఈ మార్పులు సోషలిజం పరిరక్షణను ముందుకు తీసుకెళ్లడానికి, సామాజిక న్యాయాన్ని విస్తరించడానికి, ఆర్థిక సంపదను సృష్టించి సమానంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించినవని అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. ఈ సంస్కరణల్లో కొన్నింటిపై పూర్తి ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ తక్షణమే అమలు చేయక తప్పదని హెచ్చరించారు.


ఈ సంస్కరణలను క్యూబా ప్రభుత్వం అమెరికాతో జరిపే చర్చలతో ముడిపెట్టనప్పటికీ, ఆర్థిక, రాజకీయ మార్పులు తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం హవానాపై ఒత్తిడి తెస్తోంది. ప్రస్తుతం క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆచరణాత్మకంగా స్తంభించిపోయింది. 2020 మరియు 2025 మధ్య కాలంలో నమోదైన 15శాతం కంటే ఎక్కువ సంచిత క్షీణతకు తోడు, ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం మేర కుంచించుకుపోతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి, క్రమబద్ధీకరణ, ప్రజల సూచనలతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం అవసరమని డియాజ్ కానెల్ స్పష్టం చేశారు. ఈ సంస్కరణలు చట్టపరమైన రూపంలోకి రావాలంటే, నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ (ఎఎన్‌పిపి) ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది.


ప్రస్తుతం క్యూబా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనవరి నుండి అమెరికా విధించిన చమురు దిగ్బంధనం వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనికి తోడు క్యూబా ప్రభుత్వంతో వ్యాపారం చేసే కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును కూడా జారీ చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్