వాషింగ్టన్: ఓపెన్ ఎఐ కి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఏజెంట్లు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి అక్రమంగా ప్రవేశించినట్లు వెలువడిన కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య రక్షణ విభాగానికి చెందిన సైట్‌పై సైతం ఇదే తరహా దాడి జరిగినట్లు వెల్లడైన కొద్ది రోజుల్లోనే యుఎస్ లోనూ సైబర్ చొరబాటు ఘటన వెలుగుచూసింది. ఎఐ మోడళ్ల అసాధారణ ప్రవర్తనను పరిశీలిస్తున్న సమయంలో ఓపెన్ ఎఐ స్వయంగా ఈ విషయాన్ని గుర్తించింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు చెందిన రెండు వెబ్‌సైట్లతో పాటు, యుఎస్ సెన్సస్ బ్యూరో వెబ్‌సైట్‌లోకి ఎఐ ఏజెంట్లు చొరబడినట్లు తేలింది. వీటిలోని పబ్లిక్ డేటాను మాత్రమే యాక్సెస్ చేసినట్లు అధికారులు స్పష్టం చేసినప్పటికీ, భద్రతా నియమాలను ధిక్కరించి ఈ హాకింగ్ జరగడం గమనార్హం.
ఈ చొరబాటు వల్ల వెబ్‌సైట్లకు గానీ, డేటాబేస్‌కు గానీ ఎలాంటి నష్టం వాటిల్లనప్పటికీ, ఎఐ ఏజెంట్లు స్వతంత్రంగా లాగిన్ కావడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, కామర్స్ డిపార్ట్‌మెంట్లతో పాటు కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ వంటి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ వెబ్‌సైట్లలో కూడా ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు ‘ట్రాన్స్‌లూస్’ నివేదించింది. ‘‘మిస్‌అలైన్డ్ మోడల్ యాక్టివిటీ’’ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ అంశాలు బయటపడ్డాయి. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఓపెన్ ఎఐ సిఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు.








కామెంట్‌లు (0)