సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైద్య తరలింపుల అనుమతి కోసం చూస్తూ 300 మంది గాజా చిన్నారులు మృతి

1 గంట క్రితం

gaza.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గాజా : గాజా నుంచి అత్యవసర వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇజ్రాయెల్ అనుమతి కోసం ఎదురుచూస్తూ సుమారు 300 మంది పాలస్తీనా చిన్నారులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మృతుల్లో క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. మరో 5,400 మంది పిల్లలు వైద్య తరలింపు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొంది. ఇప్పటివరకు వెల్లడైన గణాంకాలు సంక్షోభ తీవ్రతను పూర్తిగా ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ విధిస్తున్న ఆంక్షలు, అనుమతుల్లో జాప్యం కారణంగా వేలాది మంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 29న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గాజాలో 21,468 మంది రోగులు, క్షతగాత్రులు అత్యవసర వైద్య తరలింపు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 6,430 మందిని అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసులుగా గుర్తించారు. వీరికి తక్షణ వైద్య తరలింపు అవసరమని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు కేవలం 3,056 మందిని మాత్రమే విదేశాలకు తరలించినట్లు వెల్లడించింది. ప్రతి నెలా కొత్త కేసులు చేరుతుండటంతో వైద్య తరలింపుల అవసరానికి, అందుబాటులో ఉన్న సదుపాయాలకు మధ్య అంతరం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. తరలింపు కోసం ఎదురుచూస్తున్న వారిలో సుమారు 5,600 మంది పిల్లలు, 2,800 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారని, వీరితోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న 194 మంది, మరో 2,000 మంది అత్యవసర చికిత్స అవసరమైన రోగులు ఉన్నారని తెలిపింది. రఫా సరిహద్దు మార్గాన్ని ఇజ్రాయెల్ మూసివేసినప్పటి నుంచి వైద్య తరలింపు కోసం ఎదురుచూస్తూ 2,027 మంది రోగులు మరణించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ, ఇజ్రాయెల్ విధిస్తున్న పరిమితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటికే జాబితాలో ఉన్న రోగులందరినీ తరలించడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రతి నెలా కొత్త కేసులు చేరుతుండటంతో వాటిని పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టవచ్చని, దీంతో మొత్తం నిరీక్షణ కాలం ఎనిమిదేళ్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఇంతకాలం వేచిచూడాల్సి వస్తే అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ వైద్య తరలింపుల సంఖ్యను పెంచడంతోపాటు, సరిహద్దు దాటే ప్రక్రియను సరళీకరించాలని కోరింది. మందులు, వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి కొరతతో గాజాలోని ఆస్పత్రులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మానవతా సాయం ప్రవేశంపై ఆంక్షలు, సరిహద్దుల మూసివేతతో రోగుల తరలింపు మరింత కష్టంగా మారింది. గాజాలో వైద్య సదుపాయాల కొరత కారణంగా 18,500 మందికి పైగా రోగులకు అత్యవసర వైద్య తరలింపు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) గత ఫిబ్రవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. వైద్య తరలింపు ప్రక్రియలో పలు దశలు ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మొదట చికిత్స అందిస్తున్న వైద్యులు రోగులను తరలింపునకు సిఫారసు చేస్తారని, అనంతరం ప్రాధాన్యతా జాబితాలను ఇజ్రాయెల్ భద్రతా అనుమతి కోసం పంపిస్తారని, అనంతరం డబ్ల్యూహెచ్ఒ, భాగస్వామ్య సంస్థలు రోగులను సరిహద్దు వరకు తరలించే ఏర్పాట్లు చేస్తాయని తెలిపింది. గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళిక తొలి దశలో భాగంగా గాజాలోకి మానవతా సాయం అనుమతించాలని, రఫా సరిహద్దు మార్గాన్ని ఇరువైపులా తెరవాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. అయితే, పదేపదే సరిహద్దు మూసివేతలు, ప్రవేశంపై ఆంక్షలు, కఠినమైన భద్రతా తనిఖీల మధ్య ఇజ్రాయెల్ ఫిబ్రవరిలో మాత్రమే రఫా మార్గాన్ని తిరిగి తెరిచింది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్