అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
మరో ఐదుగురు గాయాలు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 767-300 కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి వెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మయామి-డేడ్ కౌంటీ అధికారులు తెలిపారు. విమానం వాహనాలను ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద స్థలానికి 60కిపైగా అగ్నిమాపక, సహాయక బృందాలు, సుమారు 200 మంది సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అమెజాన్ దిగ్భ్రాంతి
ప్రమాదంపై అమెజాన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనపై స్థానిక అధికారులు, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమెజాన్, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.








కామెంట్‌లు (0)