ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెతన్యాహుకు ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌ అధికారం ఎవరికి ?

9 గంటల క్రితం

A setback for Netanyahu Who will hold power in Israel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 12:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగలగా, ప్రతిపక్ష నేత ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం లభించింది. అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఇజ్రాయెల్‌లో తదుపరి అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.


120 మంది సభ్యులున్న పార్లమెంట్‌ (నెస్సెట్‌)లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అధ్యక్షుడితో జరిగిన సంప్రదింపుల్లో 67 మంది ఎంపీలు ఐసెన్‌కోట్‌ పేరును ప్రతిపాదించగా, నెతన్యాహుకు 46 మంది మద్దతు తెలిపారు. అయితే ఈ మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీగా పరిగణించలేం. ఐసెన్‌కోట్‌ తనకు కేటాయించిన 28 రోజుల్లో మెజారిటీని కూడగట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజుల గడువు పొందవచ్చు.


ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, ఆయన కూటమికి 53 స్థానాలే దక్కాయి. మరోవైపు ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని యాషర్‌ పార్టీ 21 స్థానాలు సాధించగా, ఆయన కూటమి బలం 48గా ఉంది. అరబ్‌ మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే రెండు పార్టీలు సాధించిన 19 స్థానాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. ఈ పార్టీలు ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించాయి.


అరబ్‌ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అల్ట్రా ఆర్థడాక్స్‌ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లేదా విస్తృత ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐసెన్‌కోట్‌ ముందున్న అవకాశాలు. అయితే నెతన్యాహు నాయకత్వంలో ప్రభుత్వంలో చేరేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.


మరోవైపు అరబ్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నెతన్యాహు విమర్శించారు. హమాస్‌ను ఎదుర్కోవడం, ఇజ్రాయెల్‌ సైనికుల భద్రతను కాపాడటం అలాంటి ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆరోపించారు. జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ఐసెన్‌కోట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే మరో నేతకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలూ ఫలించకపోతే తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చు. దీంతో ఐసెన్‌కోట్‌ మెజారిటీ సాధిస్తారా? నెతన్యాహు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్