బెల్గ్రేడ్ : సెర్బియాలో ఆదివారం జరిగిన ముందస్తు పార్లమెంటరీ ఎన్నికల్లో అలెగ్జాండర్ వుచిచ్ పరాజయం పాలయ్యారు. దశాబ్దానికి పైగా సెర్బియా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయనను విద్యార్థుల ఉద్యమం ఓడించింది. హోరాహోరీ పోరు తర్వాత, 30 ఏళ్లకు పైగా అత్యధిక స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైన ఆదివారం నాటి ఎన్నికలలో, వుచిచ్ విద్యార్థుల చేతిలో తన ఓటమిని అంగీకరించారు. ‘‘మనం ఈ ఎన్నికల్లో ఓడిపోయామన్నది స్పష్టమైంది’’ సెర్బియన్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎస్ఎన్ఎస్) నేత అలెగ్జాండర్ వుచిచ్ తన మద్దతుదారులతో పేర్కొన్నారు. 250 సీట్లు కలిగిన పార్లమెంటులో ఆయన పార్టీకి 105 స్థానాలు లభించే అవకాశం ఉండగా, స్టూడెంట్ లిస్ట్ 135 నుండి 140 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు.
2024 నవంబర్ 1న నోవి సాద్ నగరంలో రైల్వే స్టేషన్ పైకప్పు కూలిపోవడంతో 16 మంది మరణించిన ఘటన తర్వాత, ఈ విద్యార్థి ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. యువత నేతృత్వంలోని ఈ నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్రమయ్యాయి. అవినీతిని నిర్మూలించడం, ప్రభుత్వ సంస్థలను రాజకీయాలకు అతీతంగా ఉంచడం, పౌరుల హక్కులను పునరుద్ధరించడం వంటి వాగ్దానాలు చేసిన 'స్టూడెంట్ లిస్ట్' అనే రాజకీయ వేదికగా రూపుదిద్దుకుంది. నోవి సాడ్లోని వైద్య విభాగంలో ప్రొఫెసర్ అయిన ఇలియా స్ర్డనోవిచ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. "ఇక సెర్బియా ఒక స్వేచ్ఛాయుతమైన దేశం అవుతుంది’’ అని ప్రధాన అభ్యర్థి ఇలియా స్ర్దానోవిచ్ అన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్లు, వైద్యులు, కార్మికులతో కూడిన ప్రదర్శనకారులను వుచిచ్ "దిగ్బంధకులు"గా అభివర్ణించి, వారు సెర్బియాను అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వుచిచ్ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. మూడవసారి పోటీ చేయలేకపోయారు. దీంతో 2017లో ప్రధాని పదవిని చేపట్టాలనే లక్ష్యంతో సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎస్ఎన్ఎస్)కి నేతృత్వం వహించారు.








కామెంట్లు (0)