అత్యవసరంగా సౌదీలో దిగిన*ఫ్లై దుబాయ్ విమానం
180మంది ప్రాణాలను కాపాడిన హీరో భారత కెప్టెన్ మాంచ్చెర్
దుబాయ్ : ఇజ్రాయిల్ వెళుతున్న ఫ్లై దుబాయ్ విమానంలోని కాక్‌పిట్‌లో ఘర్షణలు చోటు చేసుకుని, ఇద్దరు పైలట్లు గాయపడ్డారని, ఆ విమానాన్ని కూడా బుధవారం అత్యవసరంగా సౌదీలో దింపేశారని వార్తలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఆ విమానంలో ఏం జరిగిందంటే...దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళుతుండగా గాల్లో విమానం వుండగానే ఒక్కసారిగా కో పైలట్ విమానంలోని వ్యవస్థలు దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుని, విమానంలోని 180మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఫ్లైదుబాయ్ హీరో, పైలట్ భారతీయుడు. కెప్టెన్ స్మిత్ మాంచ్చెర్‌గా గుర్తించారు. ఘర్షణ సందర్భంగా కత్తిపోట్లకు గురైన భారత్ పైలట్ మాంచ్చెర్ రక్తమోడుతూ నేలపై పడివున్నారని, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు బయటకు వచ్చిన విజువల్స్ వల్ల తెలుస్తోంది. తొలుత కాక్‌పిట్‌లో నుండి అరుపులు, కేకలు, ఈ ఘర్షణ అంతా చూస్తే విమానం హైజాకింగ్‌కు ప్రయత్నించారనే భయాందోళన వ్యక్తమైంది. అయితే ఆ వెంటనే అది కాదని స్పష్టమైంది. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది పైలట్లు, మరికొంతమంది ప్రయాణికులు జోక్యం చేసుకుని, కాక్‌పిట్‌లోని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్ అనే ప్రాంతానికి మళ్ళించి ల్యాండ్ చేశారు. కెప్టెన్, కో పైలట్ ఇరువురూ గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారని విమానాశ్రయ నిర్వాహక కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అటు ఎయిర్‌లైన్ అధికారులు గానీ ఇటు దుబాయ్, ఇజ్రాయిల్ అధికారులు గానీ వెంటనే ఎలాంటి వివరాలు అందించలేదు. అసలు విమానంలో ఏం జరిగిందనే సమాచారం తెలియచేయలేదు. కాగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎవరీ భారతీయ కెప్టెన్ ?
భారత పౌరుడైన కెప్టెన్ స్మిత్ మాంచ్చెర్ గతనాలుగేళ్ళుగా ఫ్లై దుబాయ్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు పదేళ్ళ పాటు స్పైస్‌జెట్‌లో కూడా చేశారు. కమర్షియల్ ప్లైయింగ్‌లో ఆయన 13ఏళ్ళ అనుభవం వుంది. 9,750 ఫ్లయింగ్ గంటల సర్వీసు వుంది.








కామెంట్‌లు (0)