ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వియత్నాంలో విషాదం

11 జులై, 2026

Boat accident in Vietnam... Tourists from Telugu states involved.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సముద్ర అలల తాకిడికి స్పీడ్‌ బోట్‌ బోల్తా

  • ఎపికి చెందిన ముగ్గురుతో సహా 15 మంది భారతీయులు మృతి

  • సిఎం, మాజీ సిఎంతో పాటు పలువురి సంతాపం

హానోయి, అమరావతి బ్యూరో, ప్రజాశక్తి యంత్రాంగం : వియత్నాంలోని అతిపెద్ద ద్వీపమైన ఫు క్వాక్లో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారు. రక్షించిన వారిలో కొంతమంది అపస్మారకస్థితిలో ఉన్నారని వియత్నాంలోని ఫు క్వాక్ ప్రత్యేక ఆర్థిక మండలి అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపేట ఆదిశేషు, ముడియం శ్రీధర్‌, గేలి జయలక్ష్మి మరణించిన వారిలో ఉన్నారని హనోయిలోని భారత రాయబార కార్యాలయం సోషల్‌ ‌మీడియా ఎక్స్‌ ‌ద్వారా తెలిపింది. వీరితో పాటు కేరళంకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన పది మంది మరణించారని రాయబార కార్యాలయం ప్రకటించింది. శనివారం ఉదయం 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న ఓషన్ పియర్ ఐలాండ్ కంపెనీకి చెందిన స్పీడ్‌బోట్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బోల్తా పడింది. ఈ బోటు పర్యాటకులను హాన్ మే రుట్ ఐలెట్ నుండి అన్ థోయ్ పోర్ట్ తీసుకెళు తోంది. ప్రమాద సమయంలో బోటు హాన్ మే రుట్ న్గోయ్ తీరానికి 400 మీటర్ల దూరంలోనూ, ఫు క్వాక్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నట్లు బోటు ప్రమాదాన్ని గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్లలో ఉన్న వారు తెలిపారు. చుట్టుపక్కల పర్యాటక బోట్ల నిర్వాహకులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పడవలో పైభాగంలో ఉన్న వారు నీటిలో పడిపోగా లోపల ఉన్నవారు బోటుతో సహా మునిగిపోయారు. దీంతో వారిని బటయకు తీయడం కష్టంగా మారిందని "కొద్దిమందిని మాత్రమే స్పృహలో ఉన్నప్పుడు బయటకు తీసుకురాగలిగాము" అని సహాయక చర్యల్లో పాల్గొన్న మరొక బోటు యజమాని తెలిపారు. ఆ సమయంలో అన్ థోయ్ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, వర్షం లేదని వివరించారు. విషయం తెలుసుకున్న వెంటనే అన్ థోయ్ బోర్డర్ గార్డ్ రెండు నౌకలు, 35 మంది అధికారులు, సైనికులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నౌకాదళం (నేవీ), కోస్ట్ గార్డ్ ఇతర దళాలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బోటులో ఉన్న 36 మందిని గుర్తించారు. ప్రమాద ఘటనపై ఓషన్ పియర్ ఐలాండ్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ పర్యాటకులను ఐలాండ్ - హాపింగ్ (ద్వీపాల సందర్శన) ట్రిప్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. స్వచ్ఛమైన నీరు, తెల్లటి ఇసుక తీరాలు పగడపు దిబ్బలకు పేరుగాంచిన ఈ ప్రాంతానికి భారతీయ పర్యాటకులు ఎక్కువ మంది వెళుతుంటారు. పడవ రకాన్ని బట్టి అన్ థోయ్ నుండి పడవ లేదా స్పీడ్‌బోట్ ద్వారా 20 నుండి 40 నిమిషాలలో ఈ ఐలెట్‌కు చేరుకుంటా రని, ఈలోపే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదం సమయంలో బోటులో 32 మంది పర్యాటకులున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్