వాషింగ్టన్ : తాను హిందూజాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్నానని, భారతదేశంలో విద్యార్థులు నిరసనలకు మద్దతు ఇస్తున్నానని యుఎస్ ప్రతినిధి రోఖన్నా పేర్కొన్నారు. నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుండి రో ఖన్నా అమెరికా కాంగ్రెస్‌కు మరోసారి ఎన్నికయ్యారు. ఆ మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో భారత్, భారతీయ అమెరికన్లపై కాంగ్రెస్ కాకస్‌కు సహ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఖన్నా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) మైనారిటీ హక్కుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ రెండు ప్రకటనలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) స్పందించాల్సి వుంది.
తాను హిందూ జాతీయ వాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నానని అన్నారు. 2028లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో ఆయన పోటీ చేసే అవకాశంపై, అలాగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై నిరసనలతో సహా భారతదేశంలోని పరిణామాలపై వ్యాఖ్యానిస్తారా అనే ప్రశ్నలకు ఆయన శుక్రవారం ఈవిధంగా సమాధానమిచ్చారు. ‘‘అవినీతికి వ్యతిరేకంగా, అందరినీ కలుపుకుని పోయే విధానానికి మద్దతుగా గళమెత్తుతున్న విద్యార్థులను అభినందిస్తున్నాను’’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మా తాతగారు గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమని, తాను గాంధీ, నెహ్రూల బహుళత్వ దృక్పథాన్ని విశ్వసిస్తానని అన్నారు. 1977 వరకు భారతదేశ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, తన తల్లి తరఫు తాత అయిన అమర్‌నాథ్ విద్యాలంకర్‌ను ప్రస్తావిస్తూ ఖన్నా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు 2023లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రో ఖన్నా హాజరయ్యారు. అమెరికా చట్టసభ సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తూ ఆయన భారతదేశానికి వచ్చారు. 2022లో, శిక్షాత్మకమైన (సిఎఎటిఎస్‌ఎ) ఆంక్షల నుండి భారతదేశానికి మినహాయింపులు మంజూరు చేసే అమెరికా కాంగ్రెస్ శాసన సవరణను కూడా ఆయన రచించారు. తాజాగా శుక్రవారం భారతదేశంలోని గురుద్వారాలపై జరుగుతున్న వరుస "విజిలెంట్ దాడుల"పై ఆందోళన వ్యక్తం చేస్తూ యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ ఒక ప్రకటనను విడుదల చేసింది.








కామెంట్‌లు (0)