ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆందోళన
కైరో : ఇజ్రాయిల్ తీవ్రస్థాయిలో సాగించిన సైనిక దురాగత దాడుల వల్ల గాజా క్రమక్రమంగా మానవులు నివసించడానికి వీల్లేని ప్రాంతంగా మారిపోతోందని పాలస్తీనా శరణార్ధులకు ఐక్యరాజ్య సమితి సహాయక, ఉపాధి సంస్థ (యుఎన్ఆర్డబ్ల్యుఎ) ఆరోగ్య విభాగ అధ్యక్షులు అకిహిరో సెయిటా అన్నారు. ఇజ్రాయిల్, హమస్ మధ్య కాల్పుల విరమణ జరిగి అక్టోబరు 10కి ఏడాది పూర్తయిన సందర్భంగా అకిహిరో సెయిటా మాట్లాడారు. అంతర్జాతీయ సమాజం దృష్టి ఇప్పుడు ఇరాన్పైకి మళ్ళిందని, తమకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని గాజా ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
2023 అక్టోబరులో గాజాపై ఇజ్రాయిల్ మిలటరీ పెద్ద ఎత్తున సైనిక చర్యలు ప్రారంభించింది. ఈ దాడుల్లో గాజాలో 74 వేల మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయిల్ బలగాలు దాడులు కొనసాగించడం, పైగా గాజాలో చాలా భాగాన్ని ఆక్రమించుకోవడంతో పాలస్తానా ప్రాంతంలో పునర్నిర్మాణ కార్యక్రమాలు మందకొడిగా నడుస్తున్నాయి. గాజాలో దాదాపుగా 70 శాతం ప్రాంతం ఇజ్రాయిల్ మిలటరీ అధీనంలోనే వుంది. ఒప్పందంలో కుదిరిన ప్రాంతాల కంటే మరింతగా ఇజ్రాయిల్ బలగాలు విస్తరించాయి. దీంతో దాదాపు 20 లక్షల మంది గాజా ప్రజలు మిగిలిన 30 శాతం ప్రాంతంలోనే జీవించాల్సి వస్తోంది. చాలామంది శిబిరాల్లోనే బతుకీడుస్తున్నారు. అక్కడ మందుల సరఫరాలు లేవు, ప్రధానంగా పారిశుధ్యానికి సంబంధించి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనేక రకాల అంటురోగాలు, చర్మవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సెయిటా పేర్కొన్నారు. ఇక పోషకాహార లోపం అతిపెద్ద సమస్యగా వుందన్నారు. ఇప్పుడు యుద్ధ కార్యకలాపాలు కొంతమేరా తగ్గినా పిల్లల దుస్థితి మారలేదని అన్నారు.
గాజాపై నియంత్రణ వున్న హమస్ నిరాయుధీకరణకు సిద్ధంగా వున్నా బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ నిరాకరిస్తోంది. దాంతో అమెరికా అధ్యక్షుడు చొరవతో రూపొందిన గాజా శాంతి ప్రణాళిక అమలు క్లిష్టమైంది. మరోవైపు అమెరికా యుఎన్ఆర్డబ్ల్యుఎకు నిధులు ఆపేసింది.








కామెంట్లు (0)