- హర్మూజ్‌లో సేవా రుసుములు వసూలు చేస్తాం
- కష్టకాలంలో అండగా ఉన్న దేశాలు ప్రత్యేకం
- ఇరాన్ రాయబారి రహ్మాని ఫజ్లీ
బీజింగ్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మిత్ర దేశాలకు హర్మూజ్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తామని ప్రకటించింది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై కొత్త రుసుములు విధించనున్నట్లు పునరుద్ఘాటించింది. అమెరికా ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, తమతో స్నేహపూర్వకంగా వ్యవహరించే దేశాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన తొలి ఒప్పందం ప్రకారం, 60 రోజుల పాటు వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము లేకుండా ఈ జలసంధి నుండి రాకపోకలు సాగించవచ్చు. ఆ గడువు ముగిశాక ఎలాంటి ఏర్పాట్లు అమల్లోకి వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. బీజింగ్‌లో శనివారం జరిగిన ప్రపంచ శాంతి వేదికలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్‌రెజా రహ్మానీ ఫజ్లీ మాట్లాడుతూ, ఈ కీలక జలమార్గానికి సంబంధించి ఒమన్‌తో కలిసి ‘కొత్త ఏర్పాట్ల’పై తమ దేశం పనిచేస్తోందని తెలిపారు.
‘హర్మూజ్ మా భూభాగ జలాల్లో భాగం. మేము కచ్చితంగా సేవా రుసుములు వసూలు చేస్తాం’ అని రహ్మానీ ఫజ్లీ పేర్కొన్నారు. అయితే ఇది ‘టోల్’ కాదని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ కొత్త ఏర్పాట్లు హర్మూజ్ జలసంధి గుండా రాకపోకల భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలపై పర్యవేక్షణ, భారీ సంఖ్యలో నౌకలు రాకపోకలు సాగించడం వల్ల ఏర్పడే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం వంటి అంశాలకు సంబంధించినవి’ అని ఆయన వివరించారు. ‘కష్ట కాలంలో మాకు అండగా నిలిచి, స్నేహపూర్వకంగా వ్యవహరించిన దేశాలను ప్రత్యేకంగా పరిగణిస్తాం’ అని ఫజ్లీ తెలిపారు. సాధారణంగా ప్రపంచ ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) రవాణాలో ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపు పూర్తిగా మూసివేయడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికాతో తొలి ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం హర్మూజ్‌పై విధించిన దిగ్బంధనాన్ని ఇరాన్ ఎత్తివేసింది. ప్రస్తుతం ఈ సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతున్నాయి.








కామెంట్‌లు (0)