మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శిలాజ ఇంధనాల ప్రస్తావనేది?

1 రోజు క్రితం

శిలాజ ఇంధనాల ప్రస్తావనేది?
ఇయు సహా పలు దేశాల తీవ్ర విమర్శలు
తుది ముసాయిదాపై విభేదాలు
చారిత్రక ఓటమిని మూటగట్టుకున్న కాప్‌ - 31సదస్సు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 09:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇయు సహా పలు దేశాల తీవ్ర విమర్శలు

తుది ముసాయిదాపై విభేదాలు

చారిత్రక ఓటమిని మూటగట్టుకున్న కాప్‌ - 31సదస్సు

ఆంటాల్యా (టర్కీ) : శిలాజ ఇంధనాలపై నెలకొన్న ప్రతిష్టంభనతో ఇక్కడ జరుగుతున్న కాప్‌ 31 ‌వాతావరణ సదస్సు చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది. శిలాజ ఇంధనాల గురించి స్పష్టంగా ప్రస్తావించడంలో విఫలమైనందుకు గానూ తుది ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించడానికి యురోపియన్‌ ‌యూనియన్‌ సహా పలు ఇతర దేశాలు ఆదివారం తిరస్కరించాయి. వాస్తవానికి సదస్సు ముగియాల్సిన సమయం కన్నా 44గంటలు పొడిగించినా ఫలితం లేకపోయింది. ఇంత సుదీర్ఘకాలం సాగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుగా ఈ కాప్‌ ‌సదస్సు రికార్డు సృష్టించింది.

ఇయు అధ్యక్ష వర్గం తరపున ఐర్లాండ్‌ ‌వాతావరణ శాఖ మంత్రి దారా ఓ బ్రియాన్‌ ‌మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు ప్రధాన చోదక శక్తులైన బొగ్గు, చమురు, గ్యాస్‌లను విస్మరించిన ఒప్పందాన్ని ఇయు బ్లాక్‌ ‌ధృవీకరించేది లేదని స్పష్టం చేశారు. మార్షల్‌ ‌దీవులు, పనామా, వనాటూ, బెలిజ్‌ ‌దేశాలు కూడా ఈ ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకించాయి. శిలాజ ఇంధనాల ప్రయోజనాల లబ్ది కోసం తమ భవిష్యత్‌‌పై రాజీపడలేమని మార్షల్‌ ‌దీవుల వాతావరణ శాఖ ప్రతినిధి కేథీ జెట్నిల్‌ ‌స్పష్టం చేశారు. ఏకాభిప్రాయం కుదరలేదని కాప్‌ 31 అధ్యక్షుడు మురాత్‌ ‌కురుమ్‌ ‌అంగీకరించారు. ముసాయిదాపై స్పష్టమైన అంగీకారం లేనందున ఆ నిర్ణయాలేవీ ఆమోదించబడలేదని ముగింపు సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

శిలాజ ఇంధనాల నుండి దూరంగా జరగాలన్న 2023నాటి అంతర్జాతీయ నిబద్ధతను మాత్రమే ఈ ప్రతిపాదిత ఒప్పందం పరోక్షంగా ప్రస్తావించింది. కార్బన్‌ ‌కేప్చర్‌ ‌సాంకేతికతను విస్తరించడానికి మద్దతును ప్రకటించింది. కాలుష్యాలను తగ్గించడానికి ఇది తగిన పరిష్కారం కాదని పర్యావరణ గ్రూపులు దీన్ని విమర్శిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు శిలాజ ఇంధనాలపై స్పష్టమైన పద ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.

అంతర్జాతీయంగా తుది ఇంధన వినిమయంలో విద్యుత్‌ ‌వాటాను 2035నాటికల్లా 35శాతానికి పెంచాలని, పరిశుద్ధ ఇంధనాన్ని విస్తరించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అదనపు విద్యుత్ పునర్వినియోగ వనరుల నుండే వస్తుందని ఇది హామీ కల్పించలేదు. భవిష్యత్‌‌లో ఐపిసిసి (వాతావరణ మార్పులపై అంతర్‌‌ ప్రభుత్వ ప్యానెల్‌) వాతావరణ నివేదికలు ఇచ్చే సమయంపై, గ్లోబల్‌ ‌వార్మింగ్‌‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న నిబద్ధతలను బలోపేతం చేయడంపై విభేదాలు తలెత్తాయి. ఐపిసిసి రూపొందించే తదుపరి నివేదికలను ఆలస్యం చేసేందుకు సౌదీ అరేబియా, భారత్‌, కెన్యా చేసిన ప్రయత్నాలు చర్చల్లో మరో ప్రధానమైన వివాదాస్పద అంశంగా మారాయి.

ప్రతిపాదిత 120 బిలియన్ల డాలర్ల వాతావరణ నిధి లక్ష్యాన్ని తొలగించడం పైనా వర్ధమాన దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాతావరణ మార్పుల వల్ల తీవ్ర సంక్షోభాలు, వైపరీత్యాలను ఎదుర్కొంటున్న దేశాలకు తగినరీతిలో ఆర్థిక సాయం అందించడంలో సంపన్న దేశాలు విఫలమయ్యాయని విమర్శించాయి. ఈ దేశాలు సొంతంగా ఈ సంక్షోభాలను ఎదుర్కొనలేవని మార్షల్‌ ‌దీవుల వాతావరణ శాఖ ప్రతినిధి కేథీ జెట్నిల్‌ ‌వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ ‌కూడా ఈ ఫలితంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. పటిష్టమైన సమిష్టి వాతావరణ కార్యాచరణను చేపట్టడానికి బదులుగా శాస్త్రీయ నిబద్ధతల నుండి వెనుకడుగు వేయడాన్ని ఈ ప్రతిపాదిత ఒప్పందం సూచిస్తోందని విమర్శించింది. కాలుష్యాన్ని కొనసాగించడానికి ఈ ముసాయిదా ఒక లైసెన్స్‌ ‌వంటిదని పర్యావరణ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్