- నా నాయకత్వంలో ప్రభుత్వంలో చేరండి
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న గాడి ఐసెన్‌కోట్.. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్టీతో పాటు ఆయన అతివాద మిత్రపక్షాలకు తన ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానం పలికారు. అయితే ప్రభుత్వానికి మాత్రం తానే నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ ఐక్యత అవసరమని, అందుకు అన్ని పక్షాలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
లికుడ్ పార్టీ, రిలీజియస్ జియోనిస్ట్ పార్టీ సభ్యులు నిజంగా ఐక్యతను కోరుకుంటే, తాను ప్రతిపాదించిన సూత్రాలకు మద్దతు ఇస్తూ తన నాయకత్వంలోని ప్రభుత్వంలో చేరడానికి అభ్యంతరం ఉండకూడదని ఐసెన్‌కోట్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అతివాద ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ పార్టీని కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న గాడి ఐసెన్‌కోట్‌కు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశాన్ని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అధికారికంగా కల్పించారు. ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఐసెన్‌కోట్ రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయనకు ఆరు వారాల గడువు ఉంది.
అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి గానీ, ఐసెన్‌కోట్‌కు గానీ పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా అరబ్ నేతృత్వంలోని పార్టీలు తదుపరి రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ పార్టీలు ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాలు సాధించడంతో పాటు నెతన్యాహు, ఆయన మిత్రపక్షాల నుంచి రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుతో పాటు విభిన్న రాజకీయ సిద్ధాంతాలున్న పార్టీలను ఒకే కూటమిలోకి తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. నెతన్యాహు పార్టీకి ఆహ్వానం పలికినప్పటికీ, తన నాయకత్వంపై రాజీ పడబోనన్న ఆయన వైఖరి ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.







కామెంట్‌లు (0)