నౌకలకు ఇరాన్ హెచ్చరిక..
టెహ్రన్ : అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి సమీపంలో కొత్తగా ఓ 'ఎక్స్‌క్లూజన్ జోన్' (నిషేధిత ప్రాంతం) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకపైన అయినా కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. రాబోయే కొద్ది రోజుల్లో లేదా వారాల్లో ఈ జోన్‌ను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అమెరికా నేవీ ఏర్పాటు చేసిన బ్లాకేడ్ లైన్ నుంచి ప్రారంభమై, హర్మూజ్ జలసంధి మీదుగా పర్షియన్ గల్ఫ్‌లోకి ఈ జోన్ విస్తరించి ఉంటుందని వివరించారు. ఈ ప్రాంతంలోకి వచ్చే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చుతామని, ఇది వాటి ఇన్సూరెన్స్, భవిష్యత్ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "హర్మూజ్ తెరిచే ఉంది" అని చెప్పడం ఓ "పెద్ద అబద్ధం" అని రెజాయీ కొట్టిపారేశారు. గతంలో రోజుకు 100కు పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ఇప్పుడు కేవలం 7-8 నౌకలు మాత్రమే (అదీ ఇరాన్‌కు అవసరమైనవి) వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)