శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపశ్చిమాసియాలో భీకర పోరు

14 జులై, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా

  • టెహ్రాన్‌ ప్రతిదాడులు

  • భారత నావికుడు మృతి

  • జలసంధిలో 20 శాతం టోల్‌ వసూలుపై వెనక్కి తగ్గిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా దాడులు చేసినట్లు ప్రకటించింది. బుషెహర్, చాహ్ బహార్, జాస్క్, కొనరాక్, అబు మూసా, బందర్ అబ్బాస్ వంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఐదు గంటల మిషన్‌లో అమెరికా బలగాలు విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని పేర్కొంది. హర్మూజ్‌ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులను మరోసారి దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే భీకర దాడి మొదలైంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా బహ్‌రైన్, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది. యుఎఇకి సంబంధించిన రెండు నౌకలు... మొంబాసా, అల్ బహియాలు హర్మూజ్‌‌లో ప్రయాణిస్తుండగా వాటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఓ నావికుడు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేసి ఒమన్ సమీపంలో హార్ముజ్‌ను దాటుతున్నందునే నౌకలపై దాడి చేశామని రివల్యూషనరీ గార్డులు తెలిపారు. హర్మూజ్‌ జలసంధిలో ఇరు దేశాల మధ్య సైనిక చర్యలు, చమురు ట్యాంకర్లపై దాడులు, దౌత్యపరమైన ప్రతిస్పందనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పెరిగాయి.

ఇరాన్‌ ‌దాడిలో భారతీయుడు మృతి..

హర్మూజ్‌ జలసంధిలో రెండు ఎమిరాటి చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడంతో ఒక భారతీయ నావికుడు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడు మొంబాసా ట్యాంకర్‌లో ఉన్న భారతీయ సిబ్బంది అని, గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్లు ఉన్నారని తెలిపింది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను పిలిపించి, ఈ దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. యుఎఇ కూడా దాడులను తీవ్రంగా ఖండించింది.

​మాటమార్చిన ట్రంప్

హర్మూజ్‌ ‌జలసంధిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామని, 20 శాతం టోల్‌ ‌వసూలు చేస్తామని ప్రకటించిన ట్రంప్‌. అంతలోనే మాటమార్చారు. మంగళవారం నాడు ఇరాక్‌ ‌ప్రధానితో కలిసి ‌వైట్‌‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇతర దేశాలతో మాట్లాడానని, వారు అమెరికాలో రికార్డు స్థాయిలో బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇది ఆమోదయోగ్యమైందని, దీంతో ఎటువంటి రుసుం ఉండదని స్పష్టం చేశారు. ఈ జలసంధిని యావత్ ప్రపంచం కోసం, చైనా కోసం కూడా కాపాడుతున్నామని ట్రంప్‌ ‌చెప్పుకొచ్చారు.

పికాక్స్ జోలికొస్తే వినాశనమే : ఇరాన్

ఇరాన్‌లోని పికాక్స్ పర్వతంపై దాడి చేస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. అదే జరిగితే వినాశనం తప్పదని, అమెరికా సైన్యం, దాని ప్రాంతీయ మిత్రులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పికాక్స్ పర్వతంపై ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తుండగా, అందులో నిజం లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. హర్మూజ్‌‌, పర్షియన్‌ ‌గల్ఫ్‌ భద్రత, స్థిరమైన పురోగతి వ్యూహాలపై ఇరాన్‌ పార్లమెంట్‌‌లో ‌బిల్లు ప్రవేశపెట్టారు.

​ హర్మూజ్‌ జలసంధిలో సురక్షితమైన ప్రయాణాన్ని పునరుద్ధరించాలని చైనా ఇరు దేశాలను కోరింది. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ఆకాంక్ష ఇదేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై భారీ రుసుములను విధించాలనే డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా “పైరసీ” చర్యగా అభివర్ణించారు. ట్రంప్ గతంలో ఇరాన్ ఓడరేవులపై నావికా దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తానని, హోర్ముజ్ మీదుగా రవాణా చేయబడే అన్ని సరుకులపై 20 శాతం సుంకం విధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్