మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Mexico - చర్చి వేడుకల్లో బాణసంచా పేలుడు - 10 మంది మృతి

18 గంటల క్రితం

Firecracker explosion at church celebrations – 10 dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెక్సికో : మెక్సికోలోని టెమాస్కాల్సింగో పట్టణంలో ఒక మతపరమైన ఉత్సవంలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. నుఎస్ట్రా సెనరో డి లా లూజ్ చర్చి సమీపంలో నిర్వహించ తలపెట్టిన బాణసంచా ప్రదర్శన కోసం పటాకుల సామగ్రిని భద్రపరిచారు. అయితే, కార్యక్రమం ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి 10 మంది దుర్మరణం పాలవగా, మరో 64 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదం వేడుకను వీక్షించేందుకు విచ్చేసిన వందలాది మంది సందర్శకులను భయాందోళనకు గురిచేసింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కాంపౌండ్ గోడ కూలిపోవడంతో దాని శిథిలాలు స్థానికులపై పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన 64 మందిలో ఇద్దరు స్థానిక మత గురువులు (ఫాదర్లు) కూడా ఉన్నట్లు బిషప్ ధ్రువీకరించారు.సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి.

విచారణ చేపట్టిన అధికారులు ...

మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. బాణసంచా నిల్వలో వహించిన నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాలు ప్రమాదానికి కారణమా అన్న కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మెక్సికోలో జరిగే వీధి ఉత్సవాలు, మతపరమైన పండుగల్లో బాణసంచా వినియోగం విస్తృతంగా ఉన్నప్పటికీ, సరైన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు పునరావృతమవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఘటనతో మరోసారి మతపరమైన వేడుకల్లో బాణసంచా వినియోగంపై భద్రతా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాల్లో పటాకుల నిల్వ, నిర్వహణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రమాదం చెబుతోంది. టెమాస్కాల్సింగోలో జరిగిన ఈ విషాద ఘటనలో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పేలుడుకు అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్