లాహోర్ :
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న 'రెహ్మాన్ బాబా ఎక్స్‌ప్రెస్' ముల్తాన్ సమీపంలోని షేర్ షా బ్రిడ్జ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు మరియు రెస్క్యూ అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 5:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 13 కోచ్‌లను క్లియర్ చేయగా, మరో కోచ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ముల్తాన్‌లోని నిశ్తర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి ఎటువంటి ఆలస్యం లేకుండా అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
రైలు పట్టాలు తప్పడానికి గల అసలు కారణం ఏమిటనేది అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. కాగా, పాకిస్తాన్‌లోని పాతబడిన రైల్వే వ్యవస్థ కారణంగా భద్రతా లోపాలు తలెత్తి ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటం గమనార్హం.







కామెంట్‌లు (0)