మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆందోళనకూ అద్దె మోత: రామ్‌లీలా మైదానంలో రోజుకు రూ. 1.21 లక్షలు!

1 గంట క్రితం

ఆందోళనకూ అద్దె మోత: రామ్‌లీలా మైదానంలో రోజుకు రూ. 1.21 లక్షలు!

ఆందోళనకూ అద్దె మోత: రామ్‌లీలా మైదానంలో రోజుకు రూ. 1.21 లక్షలు!

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* రామ్‌లీలా మైదానంలో రోజువారీ అద్దె రూ. 1.21 లక్షలు..

* ఈ ఏడాది బుకింగ్స్ మిగిలింది కేవలం 3 రోజులు మాత్రమే!


న్యూఢిల్లీ:

దేశ రాజధాని దిల్లీలో ప్రజాస్వామ్య నిరసనలకు వేదికలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. దశాబ్దాలుగా ఎన్నో చారిత్రక పోరాటాలకు నిలయమైన ప్రసిద్ధ జంతర్‌మంతర్‌ను ఇటీవల నిరసన వేదికల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం రామ్‌లీలా మైదానాన్ని ప్రధాన నిరసన వేదికగా ప్రకటించింది.


అయితే, జంతర్‌మంతర్‌ స్థానంలో కొత్త వేదికగా మార్చిన రామ్‌లీలా మైదానంలో ఆందోళనలు చేపట్టాలంటే సామాన్యులకు భారంగా మారే భారీ మొత్తాన్ని కేంద్రం వసూలు చేస్తోంది. ఇక్కడ ఒక్క రోజు బుకింగ్ ఛార్జీ రూ. 50,000. దీనికి అదనంగా రూ. 55,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అన్ని రకాల పన్నులు కలుపుకుని ఒక్క రోజు వినియోగానికి సుమారు రూ. 1.21 లక్షల వరకు ఖర్చవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇస్తారని చెబుతున్నప్పటికీ, నిరసనకు సిద్ధమయ్యే సమయంలో నిర్వాహకుల చేతిలో కనీసం రూ. 1.21 లక్షలు ఉండాల్సిందే.


బుకింగ్స్ ఫుల్..

రామ్‌లీలా మైదానంలో ఈ ఏడాదికి మిగిలిన రెండున్నర నెలల కాలానికి సంబంధించిన బుకింగ్స్ డిసెంబర్ 29, 30, 31 తేదీలలో మాత్రమే ఇక ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మైదానంలో కేవలం అతి చిన్న భాగాన్ని మాత్రమే ఉచిత నిరసనల కోసం కేటాయిస్తున్నారు. అక్కడ గరిష్టంగా 150 మంది మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంది. గతంలో జంతర్‌మంతర్‌లో నిరసనలు తెలిపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం.


కొత్త వేదికల వివరాలు, దూరభారం:

జంతర్‌మంతర్‌కు ప్రత్యామ్నాయంగా రామ్‌లీలా మైదానంతో పాటు బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను కొత్త నిరసన వేదికలుగా నిర్ణయించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన విభాగం (హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్) రామ్‌లీలా మైదానం బుకింగ్స్‌ను పర్యవేక్షిస్తోంది.


ఢిల్లీ పోలీసుల నుంచి అధికారిక అనుమతి పత్రం లభిస్తేనే కార్పొరేషన్ బుకింగ్‌ను ఖరారు చేస్తుంది. ఈ మైదానాలకు సంబంధించిన అద్దెలు ఇలా ఉన్నాయి:


* బురారీ గ్రౌండ్: రూ. 80,000

* రామ్‌లీలా మైదానం: రూ. 50,000

* సీబీడీ గ్రౌండ్: రూ. 15,000


పార్లమెంటుకు దూరం మరో పెద్ద సమస్య:

ఈ కొత్త నిరసన వేదికలు పార్లమెంటు భవనానికి అత్యంత దూరంగా ఉండటం మరో ప్రధాన సవాలుగా మారింది. రామ్‌లీలా మైదానం పార్లమెంటుకు 3 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సీబీడీ గ్రౌండ్ 10 నుంచి 14 కిలోమీటర్లు, బురారీ మైదానం ఏకంగా 15 నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్