ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె పర్యవేక్షణలో పరిశోధన చేసిన పి. తిరుపతి రావుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మెడిసినల్ ప్లాంట్ మీడిఎటెడ్ సిల్వర్, కాపర్ అండ్ సిల్వర్-ఐరన్ బయోమెటాలిక్ నానోస్ట్రక్టర్స్ ఫర్ మల్టి టార్గెటెడ్ బయో మెడికల్ అప్లికేషన్స్ అనే పరిశోధనా సిద్ధాంత గ్రంథానికి గాను ఆయన ఈ డాక్టరేట్‌ను పొందారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న పి. తిరుపతి రావుకు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. డా. తిరుపతి రావు తన పరిశోధనను ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), రాజమహేంద్రవరంలోని రీసెర్చ్ అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్ (RAM) సైన్స్ సెంటర్ లో నిర్వహించారు. సిఎస్ఐఆర్ - యుజిసి జెఆర్ఎఫ్ పరీక్షలో అర్హత సాధించి, ఈ పరిశోధనా కేంద్రంలో పూర్తి కాలపు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) గా చేరి, అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) గా పరిశోధన కొనసాగించారు. ఔషధ మొక్కల సహాయంతో వెండి, రాగి మరియు వెండి–ఇనుము బైమెటాలిక్ నానో నిర్మాణాలను పర్యావరణహిత పద్ధతుల్లో తయారు చేయడం, వాటి లక్షణాలను అధ్యయనం చేయడం, వివిధ జీవవైద్య అనువర్తనాల్లో వాటి సామర్థ్యాన్ని పరిశీలించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. నానోసైన్స్, మెటీరియల్ సైన్స్ మరియు బయోమెడికల్ పరిశోధనల సమన్వయానికి ఈ పరిశోధన ప్రాధాన్యతను చాటిచెబుతుంది. డా. తిరుపతి రావు ఇప్పటివరకు 20 పరిశోధనా వ్యాసాలను ప్రచురించగా, 11 పేటెంట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. అంతేకాకుండా, తన పరిశోధనా మార్గదర్శి ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె. సహకారంతో నానో మెటీరియల్స్ అండ్ అప్లికేషన్స్ అనే పుస్తకాన్ని కూడా రచించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్ర ఆర్.కె. మాట్లాడుతూ.. పరిశోధనలో నిబద్ధత, శాస్త్రీయ దృక్పథం, నిరంతర కృషి ఉంటే ఉన్నతమైన విజయాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ డాక్టరేట్ పరిశోధకుని వ్యక్తిగత విజయమే కాకుండా, ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), రాజమహేంద్రవరం పరిశోధనా సామర్థ్యానికి, శాస్త్రీయ ఆవిష్కరణలకు మరియు నాణ్యమైన ఉన్నత విద్యకు నిదర్శనమని తెలిపారు. ఈ విజయంపై కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. పి. తిరుపతి రావును అభినందించారు. భవిష్యత్తులో నానోసైన్స్, మెటీరియల్ సైన్స్ మరియు జీవవైద్య పరిశోధన రంగాల్లో మరిన్ని నూతన ఆవిష్కరణలకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)