ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమళ్లీ భగ్గుమన్న ఫ్రాన్స్

21 గంటల క్రితం

మళ్లీ భగ్గుమన్న ఫ్రాన్స్ 
- లక్షలాది మంది వీధుల్లోకి
- అధ్యక్షుడి అధికారిక నివాసానికి కట్టుదిట్టమైన భద్రత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 12:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • లక్షలాది మంది వీధుల్లోకి

  • అధ్యక్షుడి అధికారిక నివాసానికి కట్టుదిట్టమైన భద్రత

పారిస్‌ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం మరోసారి రణరంగంగా మారింది. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు శనివారం భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పారిస్ వీధులు హోరెత్తాయి. అధ్యక్షుడి అధికారిక నివాసమైన ఎలీసీ ప్యాలెస్‌ ‌ప్రాంతంలో నిరసనలను పోలీసులు నిషేధించారు. దీంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ​ కార్మిక సంఘాలు పారిస్ నడిబొడ్డున ఉన్న ప్లాస్ డి లా రిపబ్లిక్ నుంచి తూర్పున ఉన్న ప్లాస్ డి లా నేషన్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే ‘ఎల్లో వెస్ట్స్’ అధ్యక్షుడి నివాసం ఎలీసీ ప్యాలెస్, పార్లమెంటుకు సమీపంలోని ప్లాస్ డి లా కాంకార్డ్ వద్ద ర్యాలీకి పిలుపునిచ్చింది. అధికారులు ఈ ప్రదర్శనను నిషేధించి, ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. అలాగే, దక్షిణాన మార్సెయిల్, నైరుతిలో బోర్డో, ఉత్తరాన లీల్ వంటి నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. దోపిడీలను అడ్డుకునేందుకు పారిస్‌తో పాటు ఇతర నగరాల్లో దుకాణాల కిటికీలకు మళ్లీ చెక్క షట్టర్లు బిగించారు. ‘‘గత శనివారాల్లో ఉన్న ప్రమాదమే ఇప్పుడూ ఉంది’’ అని హోం మంత్రి లారెంట్ నునెజ్ అన్నారు. అయితే, ఫ్రెంచ్‌ ‌ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కాలరాస్తుందని ఎల్లో వెస్ట్‌ ‌కార్యకర్తలు విమర్శించారు. నిషేధాలు ఉద్యమాన్ని ఆపలేవని వారు తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 70వేల మంది పోలీసులను, ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించింది. పారిస్ నగరంలోనే 60వేల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్నట్లు సమాచారం. అనుమానిత ప్రాంతాలలో, రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపినప్పటికీ, నగరంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. వేతనాలు, వసతులు వంటి విషయాలపై కార్మిక సంఘాలు, యజమానుల సమాఖ్య ప్రతినిధులతో సోమవారం చర్చిస్తామని ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. అయితే, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్