ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఫ్రాన్స్‌లో కార్మిక గర్జన

2 రోజుల క్రితం

france red flag.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సార్వత్రిక సమ్మె సక్సెస్‌

  • స్తంభించిన జనజీవనం

ఫ్రాన్స్‌ : వీధుల్లోకి లక్షలాది మంది శ్రామికులు*​పారిస్: కార్మిక సంఘాల పిలుపుతో ఫ్రాన్స్ అంతటా కార్మికులు రోడ్డెక్కారు. శ్రామికలోకం గురువారం సమ్మెకు దిగారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. కనీస వేతనం పెంచాలని, కార్మికులందరికీ జీతాలు పెంచాలని, పన్ను సంస్కరణలు చేపట్టాలని, పాఠశాలల్లో మెరుగైన పరిస్థితులు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని పారిస్‌తో పాటు దక్షిణాన మార్సెయిల్, లియోన్, పశ్చిమాన నాంట్, ఉత్తరాన లిల్ నగరాల్లో భారీ ప్రదర్శనలు చేశారు. 260 నగరాలు, పట్టణాల్లో ర్యాలీలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.

సమ్మెతో ప్రజాజీవనం స్తంభించింది. రవాణా, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనగళం వినిపించారు. రిఫైనరీ కార్మికులు కూడా సమ్మెలో చేయడంతో చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఫ్రాన్స్ తన అవసరాల కోసం ఇతర దేశాల నుంచి కరెంటును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జీవనవ్యయం పెరిగిన కారణంగా దానికి అనుగుణంగా తమ కనీస వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 2027 ముసాయిదా బడ్జెట్‌లో సామాజిక ప్రయోజనాలకు నిధులు నిలిపివేయడాన్ని, ప్రజా సేవలకు నిధులు తగ్గించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెరుగైన పెన్షన్లు, నిస్పాక్షిక పన్ను విధానం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిరసనల కారణంగా ఉద్రిక్తతలు చెలరేగకుండా నివారించేందుకు దేశవ్యాప్తంగా 70 వేల మంది పోలీసులను మోహరించారు. గత మూడు వారాలుగా కొనసాగిన నిరసనల్లో కొన్ని చోట్ల అల్లర్లు, దాడులు జరగడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటి వరకూ వేలాది మందిని అరెస్ట్ చేశారు. నగర కేంద్రాల్లోని వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భవనాలకు నష్టం కలగకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

కార్మికలుకు తోడుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు..

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో దుస్థితిపై సెప్టెంబరులో విద్యార్థులు నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి ఫ్రాన్స్‌ అట్టుడికిపోతుంది. పెరుగుతున్న జీవన వ్యయం, అంతులేని అవినీతి, పాలనలో జవాబుదారితనం లేకపోవడంతో సకల జనులు విద్యార్థుల పోరాటానికి బాసటగా నిలిచారు. తాజాగా కార్మికలు సమ్మెకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. దేశవ్యాప్తంగా 16 శాతం ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ​లిల్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న చరిత్ర విద్యార్థి హ్యూగో మీడియాతో మాట్లాడుతూ, ఫ్రాన్స్‌లోని సామాజిక పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వేతనాలు తక్కువగా ఉన్నాయని, జీవితం రోజురోజుకూ ఖరీదవుతోంది. విశ్వవిద్యాలయాల్లో, ఉన్నత పాఠశాలల్లో ప్రజా సేవల కొరత కనిపిస్తోంది. అందుకే దేశంలో ప్రజలు ఉమ్మడిగా పోరాడుతున్నారు, అందుకే నేనిక్కడ ఉన్నాను’’ అని ఆయన అన్నారు. ‘‘సమాజంలో సంపద ఉంది, కానీ అది కొద్దిమంది చేతుల్లో ఉంది. పరిస్థితిని మార్చేందుకు పోరాడాలి’’ అని చెప్పారు. అయితే, లియోన్‌లో జరిగిన ప్రదర్శనపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, మున్సిపల్ కేంద్రాల వద్ద నిరసనకారులు భారీగా గుమిగూడారు. లియాన్, మార్సేయి, టౌలౌస్, నాంటెస్ వంటి నగరాల్లోని ప్రధాన వ్యాపార వీధులు, ప్రభుత్వ భవనాల పరిసన ప్రాంతాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. అల్లర్లు జరిగే అవకాశమున్న నగరాల్లో పోలీసులు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరపకుండా నిషేధాజ్ఞలు విధించారు. ప్రదర్శనలు జరిగే మార్గాల్లోని పలు కీలక భూగర్భ మెట్రో స్టేషన్లను భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్