గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్పెయిన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత - 24 గంటల్లో 60 వేల మంది వలసదారులు.. 57 మంది మృతి

01 ఆగస్టు, 2026

High tension at Spain's borders – 60,000 migrants in 24 hours... 57 dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

స్పెయిన్ : మొరాకో, స్పెయిన్ సరిహద్దుల వద్ద ఒక్కసారిగా తీవ్ర అలజడి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచి భవిష్యత్తు, చట్టబద్ధమైన నివాస హక్కులు లభిస్తాయనే ఆశతో వేలాది మంది వలసదారులు ఒకేసారి మొరాకో నుంచి స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కేవలం 24 గంటల స్వల్ప వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


స్పెయిన్ అధికారులు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం .... గడిచిన 24 గంటల్లో ఏకంగా 60,000 మంది వలసదారులు హఠాత్తుగా సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సముద్రం ద్వారా ఈదుకుంటూ, సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఇనుప రక్షణ కంచెలను తెంచుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి రావడానికి ప్రయత్నించారు. స్పెయిన్ ప్రభుత్వం తమను చట్టబద్ధమైన పౌరులుగా గుర్తించి ఆశ్రయం కల్పిస్తుందనే ఆశతోనే ఇంత పెద్ద ఎత్తున జనాలు ఒక్కసారిగా సరిహద్దుల వైపు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ తోపులాట, చొరబాటు ప్రయత్నాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరిహద్దులు దాటే క్రమంలో సముద్రంలో మునిగిపోవడం, రక్షణ కంచెల వద్ద జరిగిన ఘర్షణలు, ప్రమాదాల కారణంగా ఇప్పటివరకు 57 మంది మరణించినట్లు స్పెయిన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఊహించని సరిహద్దు సంక్షోభంతో స్పెయిన్ ప్రభుత్వం తమ సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. మొరాకో అధికారులతో కలిసి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూరప్‌లోకి ప్రవేశించడానికి ఆఫ్రికన్ వలసదారులు ఎంచుకునే ప్రధాన మార్గాల్లో మొరాకో-స్పెయిన్ సరిహద్దులు అత్యంత కీలకమైనవి. అయితే ఒకేసారి ఈ స్థాయిలో వేలాది మంది చొరబడడం సరిహద్దు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.


ఈ ఊహించని పరిణామంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దును దాటడాన్ని దేశ సార్వభౌమాధికారానికి భంగంగా అభివర్ణించిన ఆయన .... అక్కడి పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అదనపు మిలిటరీ, పోలీసు బలగాలను ఘటనా స్థలానికి తరలించామని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా ముఠాలు వలసదారులకు తప్పుడు ఆశలు చూపి ప్రమాదంలోకి నెట్టాయని, శాంతిభద్రతలను పునరుద్ధరించి చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఈ సందర్భంగా స్పెయిన్ ప్రధాని వెల్లడించారు.

spain




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్