పాకిస్థానీ సిబ్బంది నుంచి 526 కిలోల హెరాయిన్, మెథ్ పట్టివేత
న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) భారీ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది. ఈ నెల 25న గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఎటిఎస్), నిఘా సంస్థలతో కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమిన్ (మెథ్) స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలోని ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. లక్షద్వీప్‌కు పశ్చిమాన, భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్) పరిధిలో ఈ నౌకను అడ్డగించారు. దీనికి ముందు 16 రోజుల పాటు నౌక కదలికలపై నిఘా ఉంచినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్, ఇతర నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేశాయి. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను, అదుపులోకి తీసుకున్న ఐదుగురిని అధికారులు ముంబైకి తరలించారు. అక్కడ వారిని విచారించనున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చేరాల్సి ఉంది అనే వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్‌ను ‘‘డ్రగ్స్‌కు ముఖద్వారం’’గా అభివర్ణించింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను సరైన పద్ధతిలో ధ్వంసం చేయాలని కూడా పార్టీ నొక్కిచెప్పింది.








కామెంట్‌లు (0)