గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్రాన్స్‌లో హింసాత్మక ఘటనలు .. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

33 నిమిషాల క్రితం

France
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పారిస్‌ : ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు, హింసాత్మక ఘర్షణలు, పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు, పర్యటనకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. స్థానిక వార్తా కథనాలతో పాటు ఫ్రాన్స్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. పారిస్‌ ప్రాంతంలో ప్రజా రవాణాకు సంబంధించిన వివరాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఏటీపీ (ఆర్ఎటిపి) వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా మార్సెయిల్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ను సంప్రదించాలని తెలిపింది.
ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరలో పాఠశాలల్లో నిధుల కొరత, అధిక రద్దీ వంటి సమస్యలపై ప్రారంభమైన నిరసనలు క్రమంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రజా సేవల కోతలను వ్యతిరేకంగా తీవ్రతరమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో దోపిడీ, హింసాకాండ చోటుచేసుకుంది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. అక్టోబర్ 17న జరిగిన ప్రదర్శనల్లో హింస చెలరేగడంతో పారిస్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు లిల్లే, లియోన్‌, నైస్‌ నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. మార్సెయిల్‌లోనూ సమావేశాలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు. వారాంతంలో జరిగిన అల్లర్లలో 2,400 మందికి పైగా అరెస్టయ్యారని, సుమారు 1,000 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని మీడియా నివేదికలు వెల్లడించాయి. మరోవైపు, హింస పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటించారు.
ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థి సంఘం, 'ఎల్లో వెస్ట్' ఉద్యమం (ఇంధన ధరలపై 2018, 2019 సంవత్సరాల్లో దేశాన్ని కుదిపేసిన ప్రజా ఉద్యమం) శనివారం నాడు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. జీవన వ్యయాల పెరుగుదల, ప్రభుత్వ సేవలలో కోతలకు వ్యతిరేకంగా నవంబర్ 5న సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు సైతం ప్రకటించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్