టెహ్రాన్ : హార్ముజ్ జలసంధిలో ఏడు చమురు ట్యాంకర్లు దాడులకు గురయ్యాయని అధికారులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఏడు చమురు ట్యాంకర్లు దాడులకు గురయ్యాయని, సముద్ర మందుపాతరలను ఢీకొన్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. దీంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించింది. ఫిబ్రవరి 28 న ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి హార్ముజ్ జలసంధిలో ఒకే రోజు ఇన్ని నౌకలు దెబ్బతినడం ఇదే మొదటిసారి. ఈ వార్త వాస్తవమైతే.. ఈ జలమార్గంలో ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో నౌకలు దెబ్బతిన్న ఘటన ఇదే కానుందని తెలిపింది.
చమురును తరలిస్తున్న నాలుగు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవడంతో అవి మంటల్లో చిక్కుకున్నాయని రివల్యూషనరీ గార్డ్ నావికాదళం ప్రకటనను ఉటంకిస్తూ, ఇరాన్ నివేదిక పేర్కొంది. మరో మూడు నావికా మందు పాతరలను ఢీకొనడంతో దెబ్బతిని నిలిచిపోయాయని తెలిపింది. అయితే ప్రాణనష్టం, ట్యాంకర్ల జెండాల గురించిన వివరాలను ఈ నివేదిక వెల్లడించలేదు. హార్ముజ్ జలసంధిలో చట్టవిరుద్ధ మార్గాల ద్వారా చమురు ట్యాంకర్ల రవాణాకు అమెరికా యత్నిస్తే.. ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది.






కామెంట్‌లు (0)