ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాత బకాయిలతో పాటు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ సమావేశం బుధవారం మంగళగిరిలో జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం రూ.1,800 కోట్లకు జీవో జారీ చేసినా సుమారు రూ.600 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని సమావేశం పేర్కొంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజులు మాత్రమే విడుదల కాగా, మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థుల ఫీజులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజులను వెంటనే విడుదల చేయాలని కోరింది.
2026–27 నుంచి 2028–29 విద్యా సంవత్సరాలకు సంబంధించి డిగ్రీ కోర్సుల ఫీజుల నిర్ణయ ప్రక్రియను ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చొరవ తీసుకొని ప్రారంభించాలని కోరింది. వివిధ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గతంలో అమలులో ఉన్న 2 మేజర్ – 1 మైనర్ విధానాన్ని తిరిగి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె రమణాజీ, జనరల్ సెక్రటరీ జి రాజకుమార్ చౌదరి, ఫైనాన్స్ సెక్రటరీ పి రాజశేఖర్,గౌరవ అధ్యక్షులు సి విజయభాస్కర్ రెడ్డి, గౌరవ సభ్యులు గుండారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ జయరామ్, జూనియర్ కళాశాలల అధ్యక్షులు విఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)