సాక్ష్యాలు కూడా లేకుండా చేయడంపై మండిపాటు
పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కృష్ణలంక లాకప్‌డెత్ కేసులో మృతుడి సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. కేసు వివరాలను నేరుగా సీల్డు కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతోపాటు తాము విచారిస్తామని చెప్పడంతో ఈ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కృష్ణలంక పోలీస్టేషన్లో రౌడీషీట్ ఉన్న సాయికృష్ణను మే 7న నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటుపై తీసుకెళ్లిన పోలీసులు తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో రాణీగారితోటలో ఉంచారు. అంతకుముందే ఆర్‌ఎంపి వైద్యుడితో ట్రీట్‌మెంటు ఇప్పించారు. చనిపోయిన సాయికృష్ణను బండిమీద తీసుకెళ్లి కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో కట్టెలపై కాల్చేశారు. విద్యుత్ శ్మశానవాటిక ఉన్నప్పటికీ ఆ సమయంలో వేడి చేసేందుకు వీలుకాకపోవడంతో అప్పటికే తగలబడుతున్న వేరొక మృతదేహాంపై ఉంచి తగులబెట్టేశారు. అంతకుముందు పోలీస్టేషన్లో కొడుతున్న సమయంలో చూసిన తల్లి అనంతరం కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వ్యవహారం బయటకొచ్చింది. తొలుత సాయికృష్ణ మరణంపై పోలీసులు గందరగోళానికి గురిచేశారు. నిందితులను వేర్వేరుగా విచారించడంతో అసలు వ్యవహారం బయటకొచ్చింది. మృతుడి కులానికి సంబంధించిన సంఘాలు బయటకు రావడం, నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు, అతనికి సహకరించిన పోలీసులను అరెస్టు చేయడం చకచకా జరిగాయి. ఈ కేసుపై వైసిపి ఎంపి మద్దిల గురుమూర్తి సుప్రీంకోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తిని చంపి ఆచూకీ లేకుండా చేశారని, దీనిపై విచారించాలని కోరారు. నిందితులు పోలీసులుగా ఉన్న నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారుచేసి గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. విజయవాడ సిపి, డిజిపికి తెలిసే ఘటన జరిగిందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సాయికృష్ణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ తమకు బదిలీ చేయాలని, కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో ఈ నెల 30లోగా అందజేయాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 12వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్తా ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
మృతదేహం ఆచూకీ లేకుండా చేయడంపై మండిపాటు
కొట్టి చంపడంతోపాటు కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఎప్పుడు చనిపోయాడో తెలియకుండా చేశారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు చేసిన ప్రకటనతో పోలీసుల తీరుపై వివిధ వర్గాల నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్త అంశంగా మారింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.








కామెంట్‌లు (0)