- 24 మంది దుర్మరణం
జకార్తా : ఇండొనేషియాలోని బాంటెన్ రాష్ట్రం సెరాంగ్ జిల్లాలో ఓ మిఠాయిల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 29 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. వారిలో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాజధాని జకార్తాకు పశ్చిమాన ఉన్న సికాండే ప్రాంతంలోని మిఠాయిల ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో ప్రాచుర్యం పొందిన ‘మిల్కిటా’ క్యాండీలు తయారవుతాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 300 మంది పనిచేస్తున్నారు. అయితే మంటలు చెలరేగిన భవనంలో 60 మంది వరకూ ఉన్నారని తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. దీంతో బాధితుల బంధువుల నుంచి డిఎన్‌ఎ నమూనాలు సేకరిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు రెండు మూడు వారాల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం మూడో అంతస్తులో ఉన్న కూలింగ్ యూనిట్ వద్ద మంటలు ప్రారంభమయ్యాయని ప్రాణాలతో బయటపడిన కార్మికులు తెలిపారు. ప్రమాద కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. భవనం పైకప్పు కూలిపోవడం, ఇంకా కొన్ని చోట్ల పొగలు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.







కామెంట్‌లు (0)