వాషింగ్టన్ : ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ ఉద్వాసనలు చేపట్టింది. భారీ స్థాయిలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (బైఅవుట్) ప్రకటించింది. సుమారు 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ అందించినట్లు సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్లు తెలిపాయి. తొలగింపుల్లో భారత్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. భారత్‌తో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి దిగువ స్థాయి ఉద్యోగుల వరకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నాయి. అయితే డేటా సెంటర్లు, విక్రయాలు, మార్కెటింగ్ విభాగాల్లోని కొన్ని ఉద్యోగుల సమూహాలకు మినహాయింపు ఇచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు. ఉద్యోగులకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నారు. మార్పులకు అనుగుణంగా సంస్థ తన విధానాలను అభివృద్ధి చేసుకుంటున్న క్రమంలో స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ అమెరికాలోని తమ ఉద్యోగుల్లో సుమారు ఏడు శాతం మందికి ముందస్తు పదవీ విరమణ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ కల్పించినట్లు సమాచారం. అప్పుడు అర్హత పొందిన వారిలో దాదాపు 30 శాతం మంది ఈ ఆఫర్‌ను స్వీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో 2,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని నివేదిక తెలిపింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 2,28,000గా ఉంది. ప్రస్తుతం ప్రకటించిన బైఅవుట్ పథకానికి సంస్థ ఉద్యోగుల్లో సుమారు 27 శాతం మంది అర్హులుగా ఉన్నట్లు సమాచారం.
ఎఐ పెట్టుబడులు.. ఉద్యోగాల కోతలు
ఎఐ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఉద్యోగాలపై దాని ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎఐ అభివృద్ధి, వినియోగం పెరుగుతున్న కొద్దీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ వంటి ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగాల కోతలను ప్రకటిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన ఉద్యోగుల్లో సుమారు ఆరు శాతం మందిని, అంటే సుమారు వెయ్యి మందిని తొలగించనున్నట్లు గత వారం అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈబే ఈ నెల ప్రారంభంలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో 800 ఉద్యోగాలపై ప్రభావం చూపిన కోతలకు ఇది అదనం. మే నెలలో మెటా తన ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడంతో దాదాపు 8,000 మంది ప్రభావితమయ్యారు. అంతకుముందు ఏప్రిల్‌లో అదనంగా 6,000 మందిని నియమించుకునే ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు, మరో 7,000 మంది ఉద్యోగులను ఎఐ ఆధారిత పని విధానాలకు సంబంధించిన బాధ్యతల్లోకి మార్చనున్నట్లు ప్రకటించింది. ఉబర్ సంస్థ సెప్టెంబర్‌లో తన సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని తొలగించే ప్రణాళికను ప్రకటించింది. దీంతో 3,000 మందికి పైగా ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాల కోతను ప్రకటించింది.








కామెంట్‌లు (0)