నేపాల్ : సినిమాల్లో విలన్‌గా కనిపించినా .. నిజ జీవితంలో మాత్రం ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే సినీనటుడిగా సోనూ సూద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు సాయం చేసేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఆకస్మిక వరదలతో నేపాల్‌లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ వెంటనే స్పందించి నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. వరద బాధితులను స్వయంగా కలుసుకుని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. విపత్తు నుంచి బయటపడి సాధారణ జీవితం ప్రారంభించే వరకు తనవంతు సహాయం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. రాబోయే నెలల్లోనూ నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
‘నేపాల్.. నీవు ఒంటరివి కావు’
వరదల పరిస్థితిపై స్పందించిన సోనూసూద్.. సోషల్ మీడియా వేదికగా నేపాల్ ప్రజలకు అండగా ఉంటామని గతంలోనే ప్రకటించారు. ‘‘నేపాల్, నీవు ఒంటరివి కావు.. మీకు అండగా నిలిచి తిరిగి కోలుకునేందుకు ఆహారం, ఆశ్రయం, ధైర్యంతో వస్తున్నాం’’ అంటూ ఆయన చేసిన ప్రకటన పలువురిని ఆకట్టుకుంది. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తాజాగా నేపాల్ చేరుకున్న సోనూసూద్ ... బాధితులను కలుసుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ పలు విషయాలు పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘‘పునరావాస కేంద్రాల్లోని చిన్నారులను చూస్తుంటే మనసు ముక్కలవుతోంది. చాలామంది పిల్లల తల్లిదండ్రులు వరదల్లో కనిపించకుండా పోయారు. మనమెంత నిస్సహాయులమో వాళ్లను చూస్తే అర్థమవుతోంది. నేను ఓ పునరావాస కేంద్రానికి వెళ్లినప్పుడు క్రిస్టినా అనే 8 ఏళ్ల చిన్నారిని కలిశాను. తమ్ముడితో ఉన్న ఆ పాప నా వైపు చూసి నవ్వుతూ.. ‘అంతా సర్దుకుంటుంది’ అని చెప్పింది. నేను కారు ఎక్కే వరకు ఆ చిన్నారి నా వెంటే ఉంది. ఆ పాపను దత్తత తీసుకోవాలనిపించింది. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను’’ అని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులం. మీరెంత బిజీగా ఉన్నా.. ఇలాంటి కుటుంబాల కోసం కాస్త సమయం కేటాయించండి. మీకు చేతనైనంత విరాళాలు పంపండి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడం ప్రభుత్వం, మంత్రుల బాధ్యత మాత్రమే అనుకోవద్దు. ఒక మనిషిగా, భారతీయుడిగా ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. ‘‘వాళ్లు తమ ఇళ్లను, కుటుంబాలను, అందమైన బాల్యాన్ని కోల్పోయారు. మనమంతా కలసి వారికి ఓ కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు’’ అని సోనూ సూద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)