పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చాయి. తమ ప్రాథమిక హక్కులను కాపాడాలని, నిత్యావసరాలపై సబ్సిడీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు చేపట్టిన ఆందోళనలపై పాక్ భద్రతా బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. రావాల్‌కోట్ పరిధిలోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులను చెదరగొట్టే నెపంతో పాక్ సైనిక, పారామిలిటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడానికి కొద్దిసేపటి ముందే, పీవోకే నిరసన గళం అమెరికాలోని వైట్‌హౌస్ ముంగిటకు చేరింది. వాషింగ్టన్‌లో నివసిస్తున్న పీవోకే కమ్యూనిటీ ప్రతినిధులు, మహిళలు, పిల్లలతో సహా భారీ సంఖ్యలో వైట్‌హౌస్ వెలుపల గుమిగూడి శాంతియుత ప్రదర్శన చేపట్టారు. పీవోకేలో పౌర నివాస ప్రాంతాల నుండి పాక్ సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, దిగజారుతున్న మానవీయ సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని వారు గళమెత్తారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కనీస పౌర హక్కుల నిరాకరణతో సతమతమవుతున్న పీవోకే పౌరులను కాపాడటానికి, మానవతా దృక్పథంతో పూంచ్, దోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖ (LoC)ను తెరవాలని కూడా అమెరికా వేదికగా నిరసనకారులు విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)