సింగపూర్ : ఆర్థిక అద్భుతాలకు, అత్యాధునిక జీవనశైలికి చిరునామాగా నిలిచిన సింగపూర్ .... ఇప్పుడు ఓ తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఒకప్పుడు జనాభాను నియంత్రించేందుకు ‘ఇద్దరు చాలు’ అన్న సింగపూర్… ఇప్పుడు పిల్లలను కనండి అంటూ కుటుంబాలకు లక్షల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన పరిస్థితికి చేరింది. అయితే రూ.55 లక్షల ఆర్థిక సాయం కూడా యువత ఆలోచనలను మార్చగలదా ? అన్నదే ఇప్పుడు సింగపూర్ ముందున్న అసలు ప్రశ్న.
యువతను పిల్లలను కనేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ ఫ్యామిలీ సపోర్ట్ ప్యాకేజీని అక్కడి సర్కార్ ప్రకటించింది. ఈ పథకం ప్రకారం దేశంలో పుట్టే ప్రతి బిడ్డకు 17 ఏళ్లు నిండే వరకు వివిధ రూపాల్లో కలిపి దాదాపు 70,000 సింగపూర్ డాలర్లు—మన కరెన్సీలో సుమారు రూ.55 లక్షలు—ఆర్థిక సహాయం అందనుంది.

జననాల రేటు 0.87కు పడిపోవడంతో …
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ఈ కీలక ప్రకటన చేశారు. దేశంలో సంతానోత్పత్తి రేటు కేవలం 0.87 కు పడిపోవడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రకటించినా యువతలో పిల్లలను కనాలనే ఆసక్తి పెరగకపోవడంతో, ఈసారి మరింత సమగ్రమైన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది కేవలం చేతికి డబ్బు ఇచ్చే పథకం మాత్రమే కాదు. పిల్లల పెంపకంలో కుటుంబాలపై పడే ఆర్థిక, సామాజిక భారాన్ని తగ్గించేలా అనేక చర్యలను ఈ ప్యాకేజీలో చేర్చారు.
పుట్టిన వెంటనే రూ.7.8 లక్షల ‘బేబీ గిఫ్ట్’ ....
ఈ పథకం కింద పుట్టిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం 10,000 సింగపూర్ డాలర్లు—సుమారు రూ.7.8 లక్షలు—‘బేబీ గిఫ్ట్’గా అందిస్తుంది. దీనికి అదనంగా ‘ఫస్ట్ స్టెప్’ గ్రాంట్ కింద మరో 5,000 డాలర్లు అంటే దాదాపు రూ.4 లక్షలు ఇవ్వనున్నారు.
బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఏటా చైల్డ్ క్రెడిట్స్ రూపంలో 2,000 డాలర్లు చొప్పున జమ చేస్తారు. వీటితోపాటు శిశు సంరక్షణ కేంద్రాల్లో సబ్సిడీలను పెంచడంతో పాటు, తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను కూడా విస్తరించనున్నారు.
పిల్లలుంటే ఇంటి కేటాయింపులోనూ ప్రాధాన్యం .....
ప్రభుత్వం నిర్మించే బిల్డ్-టు-ఆర్డర్ ఫ్లాట్స్ కేటాయింపుల్లోనూ పిల్లలున్న కుటుంబాలకు అదనపు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి బిడ్డకు లాటరీలో ఒక అదనపు అవకాశం కల్పిస్తారు.
కుటుంబ, సంతాన ప్రోత్సాహక కార్యక్రమాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం సుమారు ఏడు బిలియన్ సింగపూర్ డాలర్లు—మన కరెన్సీలో దాదాపు రూ.5.5 వేల కోట్ల వరకు—ఖర్చు చేయడానికి సిద్ధమైంది.
“మీరు పిల్లలను కనాలని నిర్ణయించుకుంటే… ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని ప్రతి కుటుంబం తెలుసుకోవాలి” అని ప్రధాని వాంగ్ భరోసా ఇచ్చారు.
‘ఇద్దరు చాలు’ నుంచి ‘పిల్లలు కావాలి’ వరకు…
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఒకప్పుడు ‘ఇద్దరు చాలు’ అంటూ జనాభా నియంత్రణకు తీవ్ర ప్రచారం చేసిన సింగపూర్ ప్రభుత్వమే ఇప్పుడు జననాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక పథకాలు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.
1970లలో అధిక జనాభా దేశాభివృద్ధికి భారమవుతుందని భావించిన ప్రభుత్వం, 1987 నాటికి తన విధానాన్ని మార్చుకుంది. అప్పటి నుంచి జననాల రేటును పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులు, ఇతర కుటుంబ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తోంది.
విశ్వవిద్యాలయ పట్టభద్రుల కోసం మ్యాచ్‌మేకింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. సంతానోత్పత్తి రేటు మాత్రం క్రమంగా పడిపోతూనే ఉంది.

రూ.55 లక్షలు ఇచ్చినా… యువత ఎందుకు వెనుకడుగు వేస్తోంది ?
ప్రభుత్వం ఇంత భారీ ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ, ఇది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సర్వేలో దాదాపు మూడింట ఒక వంతు మంది యువత, ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చినా తమను పిల్లలను కనేలా ప్రేరేపించలేవని స్పష్టం చేశారు.
అందుకు ప్రధాన కారణాలుగా ఖరీదైన జీవనం, తీవ్రమైన పని ఒత్తిడి, పిల్లల పెంపకానికి అయ్యే భారీ ఖర్చులను పేర్కొంటున్నారు. అంటే సమస్య కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదని, యువత జీవనశైలి, భవిష్యత్తుపై ఆలోచనలు కూడా మారిపోయాయని స్పష్టమవుతోంది.
సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యూజీన్ టాన్, ప్రభుత్వ తాజా చర్యలను “సింగపూర్‌కు లభించిన చివరి అవకాశం”గా అభివర్ణించారు. కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లే సమస్య పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వివాహం, కుటుంబం, సంతానం పట్ల సమాజంలో ఏర్పడుతున్న కొత్త దృక్పథాలు, యువత మనస్తత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తగ్గుతున్న యువతరం… పెరుగుతున్న వృద్ధుల జనాభా ....
మరోవైపు సింగపూర్‌లో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండగా, పనిచేసే యువతరం సంఖ్య తగ్గిపోతోంది. ఇది దేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మరింత ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో జనాభా, కార్మిక శక్తి కొరతను అధిగమించేందుకు వలసదారులను మరింతగా ఆహ్వానించడం కూడా తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.







కామెంట్‌లు (0)