బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'2047 వరకు ఆగండి' : గురుగ్రామ్ నీటి ముంపుపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

1 గంట క్రితం

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు

న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని గురుగ్రామ్ నగరం నీట మునిగిన నేపథ్యంలో బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని అధ్వాన్న మౌలిక సదుపాయాలు, తీవ్ర ట్రాఫిక్ సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. భివానీ-మహేందర్‌గఢ్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వం లేదా పరిపాలనా యంత్రాంగాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. దాదాపు 60 ఏళ్ల క్రితం రూపొందించిన ప్రణాళికల లోపాలే ప్రస్తుత సమస్యలకు కారణమని పేర్కొన్నారు. గురుగ్రామ్ ఇంత భారీగా విస్తరిస్తుందని, జనాభా, వాహనాల సంఖ్య ఇంతగా పెరుగుతుందని అప్పటి ప్రణాళికాకర్తలు ఊహించలేదని అన్నారు. పాత మురుగు కాలువలను భవనాలు ఆక్రమించడంతో వాటిని విస్తరించడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని ధరంబీర్ సింగ్ తెలిపారు. ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోతోందని చెప్పారు. గురుగ్రామ్ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయని ప్రశ్నించగా, “2047 నాటి కొత్త మాస్టర్ ప్లాన్‌తో అంతా సర్దుకుంటుంది” అని ఆయన సమాధానమిచ్చారు. మరోవైపు గురుగ్రామ్ ఎంపీ రావు ఇందర్‌జిత్ సింగ్.. నగర ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పాలనలో చేపట్టిన తప్పుడు విధానాలే కారణమని ఆరోపించారు. కొండ ప్రాంతాల నుంచి యమునా నది వైపు నీరు ప్రవహించే సహజ కాలువల మార్గాల్లో గతంలో నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు.

పాత సహజ కాలువల మార్గాల్లో మెట్రో రైలు మార్గాల తరహాలో భూగర్భ సొరంగాలు నిర్మించడమే శాశ్వత పరిష్కారమని రావు ఇందర్‌జిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చేపడుతున్న చర్యలు కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్