టెల్ అవీవ్ : గాజాలో యుద్ధం, దేశ భద్రత, ప్రభుత్వ పనితీరుపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో మంగళవారం పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి. 120 స్థానాలున్న నెసెట్ (పార్లమెంటు)కు ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, దాని నేతృత్వంలోని తీవ్ర కుడిపక్ష కూటమి, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యషార్ పార్టీతో కూడిన ప్రతిపక్ష కూటమితో తలపడుతున్నాయి.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడి, అనంతరం గాజాపై ఇజ్రాయిల్ చేపట్టిన నరమేధం ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 74 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న నెతన్యాహు తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని అభిప్రాయ సేకరణలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పార్లమెంటులో కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.
గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఓటు హక్కు, ప్రాతినిధ్యం లేదు. మరోవైపు, ఇజ్రాయిల్ జనాభాలో దాదాపు ఐదో వంతు ఉన్న పాలస్తీనియన్ పౌరులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.







కామెంట్‌లు (0)