కొలంబో : శ్రీలంకలోని జైళ్లలో వరుసగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రెండు వేర్వేరు జైళ్లలో జరిగిన అల్లర్లలో ముగ్గురు ఖైదీలు మృతి చెందగా, మరో 23 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు, ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం .. గత గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన అల్లర్లలో ఒక ఖైదీ మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఇదే సమయంలో రాజధాని కొలంబోకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని కురువిటా జైలులో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించగా, 14 మంది గాయపడినట్లు కథనాలు వెల్లడించాయి.
శ్రీలంకలోని మూడు జైళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సంబంధిత మంత్రి తెలిపారు. దీంతో పోలీసులు, ప్రత్యేక దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కొలంబోకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని నెగొంబో ఓపెన్ జైలులోనూ ఖైదీలు నిరసనకు దిగారు. వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కన్నీటి వాయువు ప్రయోగించారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మూడు జైళ్ల వద్ద భారీగా పోలీసులు, అల్లర్ల నియంత్రణ బలగాలను మోహరించారు. జైళ్ల పైకప్పులపైకి ఎక్కిన, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లిన ఖైదీలను తిరిగి వారి వార్డుల్లోకి తరలించినట్లు మంత్రి తెలిపారు. జైళ్లలో ఖైదీల సంఖ్య అధికంగా ఉండటమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఘర్షణల వెనుక ఏదైనా అంతర్గత కుట్ర ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అన్నారు.
శ్రీలంకలో మొత్తం 22 జైళ్లు ఉన్నాయి. వాటిలో సుమారు 11 వేల మంది ఖైదీలకు మాత్రమే వసతి కల్పించే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం జైళ్లలో ఖైదీల సంఖ్య ఈ సామర్థ్యాన్ని అనేక రెట్లు మించిపోయింది. మొత్తం ఖైదీల్లో మూడొంతులకు పైగా విచారణ కోసం ఎదురుచూస్తున్న రిమాండ్ ఖైదీలే ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)