వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్‌లోని ‘పికాక్స్ పర్వతం’ కింద ఉన్న భూగర్భ అణు కేంద్రంపై త్వరలోనే దాడి చేస్తామని ఆయన ప్రకటించారు. అక్కడి అణు కార్యకలాపాలను అమెరికా నిశితంగా గమనిస్తోందని తెలిపారు. టెహ్రాన్ చేతికి అణ్వాయుధం అందకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించి ఐదు నెలలు పూర్తయిందని, ఈ కాలంలో ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడంలో అమెరికా విజయం సాధించిందని చెప్పారు.
ఇరాన్‌లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ పర్వతాన్ని స్థానికంగా ‘పికాక్స్ పర్వతం’ అని పిలుస్తారు. జాగ్రాస్ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రాంతం నతాంజ్ అణు కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఇక్కడికి తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలో అంచనా వేశాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న దానిపై స్పష్టత లేదు.
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది.








కామెంట్‌లు (0)