భారత్‌పై 100% టారిఫ్‌లకు ఛాన్స్
వాషింగ్టన్: రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసే బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు చేసుకునే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేలా రూపొందించిన ఈ బిల్లుకు సెనేట్‌లో 86-11 ఓట్లతో ఆమోదం లభించింది. ‘లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ పేరుతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. బిల్లు చట్టంగా మారితే.. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న ఐదు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, భారత్, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. దీంతో ముఖ్యంగా భారత్, చైనాపై ఈ ప్రతిపాదిత ఆంక్షల ప్రభావం పడే అవకాశం ఉంది.
రష్యా ఆర్థిక వ్యవస్థకు చమురు, గ్యాస్ కొనుగోళ్ల ద్వారా మద్దతు అందుతున్నదన్న కారణంతో ఆయా దేశాలపై ఒత్తిడి పెంచడం ఈ బిల్లు ఉద్దేశం. మరోవైపు, ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలపై ఆంక్షలు విధించే 1996 ఇరాన్ సాంక్షన్స్ యాక్ట్ గడువును 2031 వరకు పొడిగించే నిబంధనను కూడా బిల్లులో చేర్చారు. సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక అమెరికా ప్రతినిధుల సభకు వెళ్లనుంది. ఆగస్టు 31న ప్రతినిధుల సభ తిరిగి సమావేశమైన తర్వాత దీనిపై తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.








కామెంట్‌లు (0)