అమెరికా : అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దుపై కొరడా ఝుళిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ దాదాపు 3 లక్షల వీసాలను రద్దు చేశామని ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన సంగతి విదితమే. అయితే, వీసాల రద్దుపై ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి - 2026 ఆగస్టు మధ్య కాలంలో 1.75 లక్షల వీసాలు రద్దైనట్టు అప్పట్లో పేర్కొంది. ఆ తరువాత రెండు మూడు నెలల వ్యవధిలోనే రద్దైన వీసాల సంఖ్య అమాంతం పెరిగి 3 లక్షలకు చేరుకుంది.
అమెరికా చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ట్రంప్ సర్కారు వీసాల రద్దు వేగాన్ని పెంచిందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ అన్నారు. అమెరికాలో చట్టాలు ఉల్లంఘించేవారు, జాతీయ భద్రతకు ముప్పుగా మారినవారు, మోసాలకు పాల్పడే విదేశీయులను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వలసల కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ట్రంప్ ఇప్పటికే పలుమార్లు సమర్థించుకున్నారు. దేశ భద్రతకోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రద్దు చేసిన వీసాలలో సుమారు 4,000 వీసాలు బెర్త్ టూరిజం కు సంబంధించినవి కావడం గమనార్హం.
బెర్త్ టూరిజం అంటే ....
కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా ఆ శిశువుకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం సంపాదించే లక్ష్యంతో ప్రయాణించడాన్ని బెర్త్ టూరిజంగా పరిగణిస్తారు. ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే లేదా పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై దృష్టి సారించేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ .... గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ పరిపాలనలో వీసాల రద్దు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే, మోసాలకు పాల్పడే, లేదా దేశ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వీసాల రద్దు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2026 ఆగస్టు నాటికి 1,75,000 వీసాలు రద్దు కాగా, సెప్టెంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 2,50,000కి చేరింది. అప్పటికి బెర్త్ టూరిజంతో సంబంధం ఉన్న కేసులు 2,300 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 4,000 దాటింది. 2026లో ఈ రద్దు ప్రక్రియ మరింత వేగవంతమైంది. అయితే, వీసాలు రద్దయిన వారి జాతీయతకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.
మానవ హక్కుల సంఘాలు ఆందోళన ....
మరోవైపు ట్రంప్ ప్రభుత్వ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపై, ముఖ్యంగా వీసాల రద్దు ప్రక్రియలో సరైన నిబంధనలు పాటించడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యాయ ప్రక్రియలను పూర్తిస్థాయిలో అనుసరించకుండా ట్రంప్ సర్కారు త్వరితగతిన వీసాలు రద్దు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. మైనారిటీల్లో అభద్రతా భావం పెంచుతున్నారని మండిపడుతున్నాయి. జాతీయ భద్రత పేరిట విమర్శకుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి.







కామెంట్లు (0)