మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం ?

1 గంట క్రితం

War in West Asia again?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తమ పౌరులను ఇరాన్ వీడాలని అమెరికా అడ్వెజరీ

ఒప్పందానికి రాకుంటే తుడిచిపెడతా : ట్రంప్

దాడికి ప్రతి దాడి తప్పదు : ఇరాన్


టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య బెదిరింపుల పర్వం మొదలైంది. తనతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటుందని, నాయకత్వం తుడిచిపెట్టుకొనిపోతుందని అమెరికా బెదిరించగా తనపై దాడి జరిగితే ప్రతీకారం తప్పదని టెహ్రాన్ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ నేతలు తనతో ఒప్పందం చేసుకోని పక్షంలో ఆర్థికంగా నాశనం అవుతారని, నామరూపాలు లేకుండా పోతారన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశం కోసం ఈ వారంలో న్యూయార్క్ వస్తున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెషియాను కలవడానికి తాను సిద్ధమేనని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. కాగా ఇరాన్పై దాడులు జరిగితే అమెరికా స్థావరాలు, ప్రయోజనాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని, ప్రాంతీయ మిత్రదేశాలను కూడా కలుపుకుంటామని సైనిక కేంద్ర కమాండ్ తెలియజేసింది. ఇదిలా ఉండగా హౌతీల తాజా దాడులపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ వీటి కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, విమానాల రద్దు, గగనతలాల మూసివేత వంటి చర్యలకు అవకాశం ఉన్నదని తెలిపింది.


మళ్లీ దాడులకు అమెరికా సిద్ధం ?

ఇరాన్పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు సిద్దమవుతోందని తమకు సమాచారం అందిందని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ఆదివారం వెల్లడించింది. కొన్ని ప్రాంతీయ దేశాల మద్దతుతో అమెరికా ఈ చర్యలకు సన్నాహాలు చేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అమెరికా దాడులకు దిగితే ప్రాంతీయంగా ఉన్న అమెరికా స్థావరాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అలాగే, ఇరాన్లోని ఖాతమ్ అల్ అన్బియా ప్రధాన కార్యాలయం తన ప్రకటనలో అమెరికాతో కలసి వ్యవహరించే పశ్చిమాసియా దేశాలకూ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా స్థావరాల నుంచి ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులు పునఃప్రారంభమైతే, వాటికి సహకరించే ప్రాంతీయ దేశాలను కూడా ఘర్షణలో భాగస్వాములుగా పరిగణిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు ఆదివారం ఉదయం తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపాయి.

యుద్దం ముగించేందుకు అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధమని ఇరాన్ వెల్లడించింది. అయితే చర్చల్లో పాల్గొనాలంటే ఏడు షరతులకు అమెరికా ఒప్పుకోవాలని తెలిపింది. ఈ మేరకు తమ షరతులను అమెరికాకు ఖతార్ చేరవేసిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మెహ్సెన్ రెజాయీ చెప్పారు. ఈ చర్చలపై అమెరికా అధ్యక్షుడి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను తిరస్కరిస్తే మరింత దూకుడుగా నిర్ణయాత్మక యుద్ధానికి దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. చర్చల్లో పాల్గొనాలంటే అన్ని విధాలుగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, విదేశాల్లో నిలిపివేసిన నిధులను విడుదల చేయడం ఇందులో కీలకంగా ఉన్నాయి. అలాగే అమెరికా సైనిక చర్యలను నిలిపివేయడం, ప్రాంతీయ స్థాయిలో కాల్పుల విరమణకు హామీలు, ఇరాన్పై ఉన్న ఆంక్షలు ఎత్తేసి ఆర్థిక ఒత్తిడికి పరిష్కారం చూపడం, భవిష్యత్ చర్చలకు సంబంధించిన భద్రతా, రాజకీయ హామీలు ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే అమెరికా తమ నౌకా దిగ్బంధనాన్ని ఎత్తేయాలనే ప్రధాన డిమాండ్ ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్