వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ్ ఇంటి వద్ద సోదాలు...
డీఎస్సీ నిరసన నేపథ్యంలో విజయవాడలో కేసు నమోదు...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : డీఎస్సీ అక్రమాలపై నిరసనకు వెళ్లిన వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిపై విజయవాడలో కేసు నమోదైన నేపథ్యంలో పల్నాడులో అర్ధరాత్రి పోలీసుల హడావుడి చోటుచేసుకుంది. నరసరావుపేట లోని సుధీర్ భార్గవ్ రెడ్డి ఇంట్లో విజయవాడకు చెందిన పోలీసులు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అర్ధరాత్రి నుంచి పోలీసులు సుధీర్ భార్గవ్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆయన కోసం ఆరా తీసినట్లు తెలిసింది. ఇంట్లో ఆయన ఆచూకీ లభించకపోవడంతో తాను నిర్వహిస్తున్న జిబిఆర్ హాస్పిటల్ లోనూ పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. దీంతో సత్తెనపల్లి ప్రాంతంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమాలకు హాజరైన వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ భార్గవ్ రెడ్డి పై కేసు నమోదు, అనంతరం ఆయన ఇంటి వద్ద పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ అంశంపై నిరసనలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామాలతో పల్నాడు జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సుధీర్ భార్గవ్ రెడ్డిపై నమోదైన కేసు వివరాలు, పోలీసుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సుధీర్ భార్గవ్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన డాక్టర్ గోపిరెడ్డి ...
సత్తెనపల్లి వైసిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడంపై వైసిపి పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన డీఎస్సీ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తంగా మార్చారని ఆయన ఆరోపించారు. డీఎస్సీపై నిరసనకు వెళ్లిన వైసిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని గోపిరెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను ప్రశ్నిస్తే కేసులు, పోలీసుల సోదాలతో భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన వారిపైనే తమ పోరాటమని గోపిరెడ్డి స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ప్రశ్నించడం తమ హక్కన్నారు.








కామెంట్‌లు (0)