గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

శోకసంద్రంలోనే వెనిజులా

26 జూన్, 2026

deaths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 589కి పెరిగిన భూకంపాల మృతులు

- 4300 మంది పైగా క్షతగాత్రులు

- శిథిలాలు తొలగించే కొద్దీ వెలుగుచూస్తున్న మరణాలు

- భారత్‌ సహా పలు దేశాల ఆపన్నహస్తం

లా గుయిరా (వెనిజులా) : వరుస భూకంపాలతో విలవిల్లాడిన వెనిజులా ఇంకా శోకసంద్రంలోనే ఉంది. మరుభూమిని తలపించేలా మృతదేహాలు, భవన శిథిలాలు, నెత్తురోడుతూ విఘతజీవుల్లా క్షతగాత్రుల హహకారాలతో భీతావహ పరిస్థితులు కంటతడిపెట్టిస్తున్నాయి. భారత్‌ ‌సహా అనేక దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. సహాయక చర్యల్లో వెనిజులాకు అండగా నిలుస్తున్నాయి. ఈ పెను విపత్తులో మరణించినవారి సంఖ్య 589కి పెరిగింది. మరో 4300 మంది పైగా గాయపడ్డారు. క్షతగాత్రులతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయని, శిథిలాల కింద వున్నవారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రి కార్లోస్‌ అల్వరాడొ విలేకర్లకు తెలిపారు. అయితే ఇప్పటికీ వేలాదిమంది ఆచూకీ తెలియ రాకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భయపడుతున్నారు. మరోపక్క బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సహాయ బృందాలు కూడా బాధిత ప్రాంతాలకు చేరుకున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, కెనడా, మెక్సికో, కొలంబియా, ఎల్‌ ‌సాల్వడార్‌, క్యూబా, ఐక్యరాజ్య సమితిల నుండి మానవతా సాయం, గాలింపు చర్యలు చేపట్టేందుకు అవసరమైన సహాయ సామాగ్రి అందుతోంది. సహాయక బృందాలు కూడా వచ్చాయి. యుఎన్‌ ‌సహాయక చీఫ్‌ ‌టామ్ ఫ్లెచర్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 70వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయని వెనిజులా హోం మంత్రి కాబెల్లో తెలిపారు. ‘ఒక్కసారిగా అన్నీ కోల్పోయాం, ఆహారం, మందులు, ఏవీ అందుబాటులో లేవు, సాయం త్వరగా అందాలని ఎదురుచూస్తున్నాం అంటూ బాధితులు వాపోతున్నారు. బుధవారం సాయంత్రం వెనిజులా ఉత్తర ప్రాంతంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ రానంత శక్తివంతంగా ఈ భూకంపాలు నమోదయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ కొన్ని ఆంక్షలను అక్టోబరు 23వరకు సడలించింది. భూకంప సంబంధిత సహాయక చర్యలు, అవసరమైన సామాగ్రి పంపేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంది. భూకంపం ధాటికి బ్రెజిల్‌‌లోని అమెజాన్‌ ‌ప్రాంతం వరకు గల పలు భవనాలను ఖాళీ చేయించారు. ఉత్తర ప్రాంతం వ్యాప్తంగా పలు నగరాల్లో భయంతో ప్రజలు వీధుల్లోనే వుంటున్నారు. ఇళ్ళకు వెళ్ళడానికి భయపడుతున్నారు. తమ వద్ద వున్న పరికరాలతోనే అక్కడి శిధిలాలను, మట్టి దిబ్బలను పెకిలించి, తమ వారి కోసం వెతుక్కోవడానికి తంటాలు పడుతున్నారు. అక్కడ పరిస్థితులు హృదయ విదారకంగా వున్నాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లుల కోసం పిల్లలు విలపిస్తూ, వెతుక్కోవడం కనిపిస్తోంది. సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు వీలుగా భారీ నిర్మాణ పరికరాలను, యంత్రాలను, ఇతర సామాగ్రిని పంపాల్సిందిగా తాత్కాలిక అధ్యక్షురాలు రొడ్రిగజ్‌ ‌వ్యాపార వర్గాలను కోరారు. పెను విపత్తు ప్రాంతమైన లా గుయిరాకు విదేశాల నుండి సహాయక సిబ్బంది, సామాగ్రి వస్తున్నాయని ఆమె తెలియచేశారు. ఐక్యరాజ్య సమితి సర్టిఫై చేసిన సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు.

బ్రెజిల్‌, క్యూబా తదితర దేశాల సాయం

మొబైల్‌ ఫీల్డ్‌ హాస్పిటల్‌‌ను, డజన్ల కొద్దీ అగ్నిమాపక యంత్రాలను, ఇతర సహాయక సిబ్బందిని పంపినట్లు బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా ప్రకటించారు. 300మంది పారా మెడిక్స్‌‌ను, సహాయక సిబ్బందిని, 50టన్నుల పరికరాలను, ఇతర సామాగ్రిని మందులను, మౌలిక సరఫరాలను అందిస్తున్నట్లు ఎల్‌ ‌సాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ ‌బుకెలె తెలిపారు. కాగా క్యూబా హెల్త్‌ ‌వర్కర్లు ఇప్పటికే వెనిజులాలో పనిచేస్తున్నారని హవానా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్‌ ‌తెలిపారు. సహాయక కార్యకర్తలు, వైద్య సిబ్బందితో కూడిన మిలటరీ బృందాన్ని పంపినట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షబ్నం తెలిపారు. అవసరమనుకుంటే మరింత సాయం పంపడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. కొలంబియా కూడా 12టన్నుల మానవతా సాయాన్ని పంపింది. అత్యవసర మానవతా సాయాన్ని, సహాయక బృందాలను, వైద్య బృందాలను పంపుతున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. నెదర్లాండ్స్‌, టర్కీ, స్పెయిన్‌, జర్మనీ తదితర దేశాల నుండి కూడా పెద ఎత్తున సాయం వస్తోంది. అంతర్జాతీయ రెడ్‌‌క్రాస్‌, రెడ్‌ ‌క్రీసెంట్‌ ‌సొసైటీ కూడా సాయమందించింది, పోప్‌ ‌లియో అత్యవసర సాయంగా లక్ష యూరోలు పంపారని వాటికన్‌ ‌ప్రకటించింది.


ఆపరేషన్‌ అమిస్టాడ్‌

వరుస భూకంపాల వేళ వెనిజులాను ఆదుకునేందుకు భారత్‌..రెండు వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రి, వైద్యబృందాన్ని పంపింది. ఇందుకోసం ‘ఆపరేషన్​ అమిస్టాడ్​’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమల్జేస్తోంది. అమిస్టాడ్‌ అంటే స్పానిష్‌ లో స్నేహం అని అర్థం. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలకు భారత్​ కట్టుబడి ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్​ ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. ‘వెనిజులాకు అత్యవసర సాయాన్ని అందించేందుకు, భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 విమానాలు శుక్రవారం ఆ దేశానికి బయలుదేరాయి. ఈ సహాయక సామగ్రిలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవడానికి భారతదేశం కట్టుబడి ఉంది" అని జైశంకర్​ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్