- వరదలు, కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి
ఖాట్మాండు : నేపాల్‌లో గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వీటితో వరదలు, కొండచరియలు విరిగిపడ్డం.. వంటి ఘటనలు సంభవించి నేపాల్ వ్యాప్తంగా 12 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు కారణంగా నేపాల్‌లోని అన్ని ప్రధాన నదులు, ఉపనదులు, వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నేపాల్‌లోని మొత్తం 77 జిల్లాల్లో 49 జిల్లాలు ఆకస్మిక వరదల ముప్పును ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. నదీ ప్రవాహాల సమీపంల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. నదులు, వాగుల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. లుంబిని రాష్ట్రంలోని రూపందేహి జిల్లాలో బుట్వాల్ వద్ద టినౌ నది ఉధృత ప్రవాహానికి ఆరు ఇళ్లు కొట్టుకుని పోయాయి. రాహుగంగా నది పొంగిపొర్లడం వల్ల 40 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు, ట్రాన్స్‌మిషన్-లైన్ టవర్లు దెబ్బతిన్నాయి. బాగమతి రాష్ట్రంలోని చిత్వాన్ జిల్లాలో నారాయణి నది, రియు వాగు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులను మూసివేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే, అనేక జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)