దేశం వీడి వెళ్ళరాదంటూ కోర్టు ఆదేశాలు
మాడ్రిడ్ : వర్క్ కాంట్రాక్టులు పొందేందుకు గానూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సతీమణి బెగొనా గోమెజ్, ప్రధాని భార్య అన్న తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనాలని న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది. ఈలోగా ఆమె దేశం వీడి వెళ్ళకుండా నిషేధం విధించారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జువాన్ కార్లోస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆమె పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని కోరారు. నెలల రెండుసార్లు కోర్టుకు హాజరుకావాల్సి వుంటుందని స్పష్టం చేశారు. మితవాద గ్రూపులు ఈ కేసు నమోదు చేశాయి. తానెలాంటి తప్పు చేయలేదని బెగొనా గోమెజ్ చెబుతున్నారు.
యూరప్‌లో మిగిలివున్న అతికొద్ది వామపక్ష నేతల్లో ఒకరైన పెడ్రో సాంచెజ్‌పై ఒత్తిడి పెంచుతున్న అనేక అవినీతి కేసుల్లో ఇదొకటి. ఈ కేసుల్లో చాలావరకు విచారణ దశ ముగింపునకు లేదా దానికి దగ్గర్లో వున్నాయి. తనను అధికారం నుండి తప్పించేందుకు జరుగుతున్న ప్రచారంలో భాగమే ఇవన్నీ అని ఆయన చెబుతున్నారు. ఈ కేసుల్లో దేంట్లోనూ ఆయన పేరును చేర్చలేదు.
న్యాయమూర్తి రూలింగ్‌పై సోషలిస్ట్ పార్టీ వెంటనే స్పందించింది. గత రెండేళ్లు బెగొనా న్యాయపరమైన, రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నారని, ఈనాటి ఈ ఆదేశాలు అందులో భాగమేనని పేర్కొంది. సోషలిస్టు పార్టీలో మూడో స్థానంలో వున్న మాజీ రవాణా మంత్రితో సహా అనేకమంది మిత్రపక్షాల నేతలు పలుకేసుల్లో దర్యాప్తులను ఎదుర్కొంటున్నారు.








కామెంట్‌లు (0)